Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్సే
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:32 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. రాజకీయ పార్టీలు.. తమ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు చేశాయి. కానీ బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో పలువురు నేతల పేర్లను పరిశీలిస్తుంది. అలాంటి వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో నిలిపింది. బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్దమవుతుంది. అలాంటి వేళ.. బీజేపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్సే అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కారు గుర్తుకు ఓటు కమల పార్టీ బలోపేతానికే అంటూ హింట్ సైతం ఇచ్చారు. దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చివరగా బీజేపీ ఈక్వల్ టూ బీఆర్ఎస్ అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో రాసుకొచ్చారు. చివరగా జూబ్లీహిల్స్ బై ఎలెక్షన్స్ అంటూ ట్యాగ్ చేశారు. కారు, కమలం గుర్తులు ఉన్న ఫోటోలను ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
2023 ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టినా.. హైదరాబాద్ మహానగరంలోని ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జంట నగరాల్లో తన ప్రభావాన్ని నిలుపుకొంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ వరుసగా మరోసారి గెలిచారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పేరును ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖారారు చేసింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో బరిలో నిలిచి ఓడిన నవీన్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అదీకాక గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.
బీజేపీ మాత్రం అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు పలువురి పేర్లను పరిశీలిస్తుంది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ తాజాగా తెరపైకి తీసుకు వచ్చారు. ఆయనకు గతంలో ఏబీవీపీతో అనుబంధం ఉందంటూ ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. దీనిపై బొంతు రామ్మోహన్ వెంటనే స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. బీజేపీ నుంచి బరిలో దిగే ప్రసక్తే లేదంటూ కుండ బద్దలు కొట్టారు.
కానీ బీజేపీ నుంచి ఎవరు బరిలో దిగనున్నారనే అంశంపై ప్రస్తుతం సందిగ్థత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీతో గతంలో అనుబంధం కొనసాగించిన వారే.. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారనే ఒక ప్రచారం మాత్రం స్థానికంగా కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్నేహం.. స్వలింగం సంపర్కం.. ఆపై హత్య చేసి బాడీ ముక్కలు ముక్కలు!
రోజుకు రెండు అరటి పండ్లు తింటే.. మీరు..
For More Telugu News And Telugu News