Fraudster Arrest: బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 350 మందికి కుచ్చుటోపీ..
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:20 PM
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట కాకర్ల శ్రీనివాస్ గతంలోనూ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2023 సంవత్సరంలోనూ ఇలానే వందల మంది నుంచి రూ.20కోట్లు మేర వసూలు చేశాడని వెల్లడించారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(జయ గ్రూప్) పేరుతో అమాయకులను నుంచి కోట్లు వసూలు చేసిన ఆ కంపెనీ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్(Kakarla Srinivas)ను పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దాదాపు 350 మందిని నిందితుడు నిండా ముంచినట్లు పోలీసులు తెలిపారు. వెంచర్లు, రిసార్ట్స్, అపార్ట్మెంట్స్ మెట్రోస్టేషన్ రెంటల్స్ స్టాల్ పేరుతో బాధితుల నుంచి కోట్లలో వసూలు చేసినట్లు వెల్లడించారు.
డబ్బులు ఇచ్చే వారికి నమ్మకం కలిగించేందుకు ఒప్పంద పత్రాలు సైతం కుదుర్చుకుని పక్కా పథకం ప్రకారం అందినకాడికి స్వాహా చేసినట్లు చెప్పారు. 16 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. రూ.10లక్షలకు 30 శాతం వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి నమ్మకం కలిగించిన కాకర్ల శ్రీనివాస్.. అనంతరం బాధితులను ముప్పుతిప్పలు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కాకర్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు. పక్కా పథకం ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
గతంలోనూ..
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(జయ గ్రూప్స్) పేరిట కాకర్ల శ్రీనివాస్ గతంలోనూ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2023 సంవత్సరంలోనూ ఇలానే వందల మంది నుంచి రూ.20కోట్లు మేర వసూలు చేశాడని వెల్లడించారు. ఈ మేరకు కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని జయగ్రూప్ కార్యాలయానికి బాధితులు చేరుకుని పెద్దఎత్తున ధర్నా నిర్వహించారని తెలిపారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా, అంతకుముందే కేఎస్ ఇన్ఫ్రా పేరుతో హైదరాబాద్‌లో కార్యాలయం తెరిచి ప్రీ లాంచ్ పేరుతో పలువురికి కుచ్చుటోపీ పెట్టినట్లు అప్పుడే గుర్తించామని చెప్పుకొచ్చారు.
ఈ కేసులో అరెస్టు చేయగా.. బయటకు వచ్చిన కాకర్ల శ్రీనివాస్ అనంతరం జయ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేశాడని తెలిపారు. ఆ తర్వాత జయ ఇన్ఫ్రా పేరుతో టెలికాలర్స్ను నియమించుకుని అమాయకులను ట్రాప్ చేయడమే లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. భారీ ప్రాజెక్టుల పేర్లు చెబుతూ.. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చినా మళ్లీ అదే తరహా మోసాలకు పాల్పడుతూ ఈసారి ఏకంగా 350 మందిని ముంచేశాడని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
For Telangana News And Telugu News