Road Accident In Uppal: తృటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:34 PM
మంగళవారం.. ఆంజనేయస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అలాంటి సమయంలో ట్యాంకర్ వేగంగా ఆలయంలోకి దూసుకు వెళ్లింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ఆలయంలోకి సెప్టిక్ ట్యాంకర్ దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం.. ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్ఐ రెండో ఎంట్రన్స్ గేట్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలోకి ట్యాంకర్ దూసుకు వెళ్లింది. ఆ క్రమంలో ఆలయం ప్రహరీ గోడను ట్యాంకర్ అధిక వేగంతో ఢీ కొట్టింది.
ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్‌ను తొలగించి.. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఈ ఘటన కారణం కొంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. దేవాలయంలోకి దూసుకు వెళ్లిన ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించి.. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. మరోవైపు డ్రైవర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అదీకాక.. ఈ రోజు మంగళవారం. ఈ నేపథ్యంలో దేవాలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. కానీ భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
For More TG News And Telugu News