Report On Crop Damage: భారీ వర్షాలు.. తెలంగాణ వ్యాప్తంగా నష్టపోయిన పంట వివరాలు ఇవే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 09:22 PM
తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు, ఉప నదులు సహా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో అతి భారీ వర్షాలకు జాతీయ రహదారులు సైతం కొట్టుకుపోయాయి. వరదలకు పలువురు గల్లంతయ్యారు. పంట పొలాలు మెుత్తం చెరువులను తలపించాయి. పంట నీట మునిగి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై తెలంగాణ సర్కార్ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రైతులు నష్టపోయారని నివేదిక వెల్లడించింది.
తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. కామారెడ్డిలో 77,394 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వెల్లడించింది. జిల్లావ్యాప్తంగా 54,223 మంది రైతులు నష్టపోయారని పేర్కొంది. మెదక్‌లో 23,169 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా.. 24,808 మంది అన్నదాతలు ప్రభావితం అయ్యారని నివేదిక వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్‌లో 21,276 ఎకరాలు దెబ్బతినగా.. 8,071 మంది రైతన్నలు నష్టపోయారు.
నిజామాబాద్‌లో 18,417 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా.. 9,155 మంది రైతులు ప్రభావితం అయ్యారు. అసిఫాబాద్‌లో 15,317 ఎకరాల పంట నష్టపోగా.. 7,259 మంది అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరి పంటే ఎక్కువగా 1,09,626 ఎకరాల్లో దెబ్బతిందని నివేదిక తెలిపింది. అలాగే 60,080 ఎకరాల్లో పత్తిపంట నష్టం జరిగింది. 20,983 ఎకరాల హార్టికల్చర్ పంటలకూ నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. ఇక, టమోటా, మిరప, పప్పుధాన్యాలు, జొన్న, సోయాబీన్ పంటలూ వర్షాలకు ప్రభావితం అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..