Rains: భారీ వర్షాలు.. జనం బెంబేలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:26 PM
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. నగర శివారులోని జలశయాలు నిండికుండను తలపిస్తున్నాయి.
హైదరాబాద్, జులై 25: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో.. హైదరాబాద్‌తోపాటు నగర శివారు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాల కారణంగా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వర్షం.. కొంత సేపు ముసురులా.. మరికొంత సేపు భారీగా కురవడంతో పలు కాలనీలు నీట మునిగాయి. అలాగే రహదారులపైకి సైతం భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో నగరపాలక సంస్థ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీరు సక్రమంగా వెళ్లే డ్రైనేజ్ మార్గం లేక పోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైటెక్ సిటీ, ఎంజే మార్కెట్, మాదాపూర్, ఉప్పల్, కుషాయిగూడ, ముషీరాబాద్, అమీర్‌పేట్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌షుఖ్‌నగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
విద్యుత్ సరఫరాలో అంతరాయం..
ఇక భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు ఫోన్ చేసినా.. స్పందన కరువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. జంట నగరాల శివారు ప్రాంతంలోని జలాశయాల నీటి మట్టం భారీగా పెరిగింది. మరోవైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో దిగువనున్న ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇంకోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News