Hyderabad Cyber Crime: ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలు.. సైబర్ ముఠాకు పోలీసుల చెక్
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:54 PM
ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 29: ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఏకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని మరీ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ కాల్ సెంటర్ ముఠా మోసాలకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు చెక్ పెట్టేశారు. నకిలీ కాల్ సెంటర్‌పై సంయుక్తంగా దాడులు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని మాదాపూర్‌లో నకిలీ కాల్ సెంటర్‌పై పోలీసులు దాడులు చేసి.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు.
వీరంతా రిడ్జ్ (Ridge)ఐటీ సొల్యూషన్ పేరుతో కాల్ సెంటర్ నడుపుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. 12 కంప్యూటర్లు, 21 మొబైల్ ఫోన్లు, టీపీ లింక్ రౌటర్, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు గత 2 సంవత్సరాలుగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని.. 2 ఏళ్ళలో 8 నుంచి 10 కోట్లు ఆస్ట్రేలియా పౌరులు నుంచి దోచుకున్నారని సైబర్ క్రైమ్ డీసీపీ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు కలకత్తాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఆస్ట్రేలియాలో చదువుకునే ఇండియా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్స్‌ను కొనుగోలు చేసి ఇండియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఆస్ట్రేలియా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడటంతో ఇండియాలో ఉన్న నిందితుల్ని గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. ఆస్ట్రేలియా భాషలో మాట్లాడటానికి ప్రత్యేకంగా ఇక్కడ కాల్ సెంటర్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారని వివరించారు. నిందితుల్లో ఎక్కువగా కలకత్తాకు చెందిన వారు ఆరుగురు ఉండగా.. ఖమ్మంకు చెందిన గణేష్, కేశవ్ వ్యక్తులు ముందు ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని విచారణలో బయటపడిందని సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపారు.
మరో ఆరుగురు అరెస్ట్...
మరోవైపు.. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లను సమకూరుస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నలుగురు ఏపీకి చెందినవారు కాగా, ఇద్దరు తెలంగాణ వ్యక్తులు కలిసి మొత్తం ఆరుగురు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాలలో 400 సైబర్ నేరాలలో వీళ్ళ ప్రమేయం ఉందన్నారు. సైబరాబాద్ పరిధిలో మూడు కేసులు వీరిపై నమోదై ఉన్నాయని తెలిపారు. ఆరుగురు నిందితులు మూడు విడతలుగా సైబర్ నేరగాళ్లకు ఎకౌంట్లను సమకూరుస్తున్నారని.. ఇందు గాను మూడు విడుతల్లో కమిషన్ తీసుకుంటున్నారన్నారు.
ప్రతి స్టేజ్‌లో కమిషన్‌ను సైబర్ నేరగాళ్ల నుంచి నిందితులు పొందుతున్నారని తెలిపారు. మొదటి విడతలో బ్యాంక్ అకౌంట్ సమకూరిస్తే రూ.10,000 కమిషన్ తీసుకుంటున్నారని.. రెండో విడతలో కోటి రూపాయల ట్రాన్సాక్షన్స్‌కు లక్ష రూపాయలను నిందితులు కమిషన్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా
నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News