CM Revanth: కచ్చితమైన కారణం తెలియాల్సిందే.. అధికారులకు సీఎం ఆదేశం
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:26 AM
CM Revanth: పాశమైలారం ఘటనాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు ప్రమాద స్థలికి చేరుకున్నారు.
హైదరాబాద్, జులై 1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఈరోజు (మంగళవారం) ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి పాశమైలారం చేరుకున్నారు సీఎం. ప్రమాద స్థలిని పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడారు. ఆపై ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యం స్పందించిందా అని మరో ప్రశ్న వేశారు. ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఊహాజనిత జవాబులు కాకుండా వాస్తవాలను తెలపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
యాజమాన్యంపై సీఎం ఫైర్
సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోందని.. ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని నిలదీశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేవంత్ పరామర్శించనున్నారు.
కాగా.. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో సింగరేణి టీమ్ పాల్గొంది. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. 34 మందికి తీవ్రగాయాలు అవగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 29 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మృతదేహాల గుర్తించారు. ఇంకా 17 మంది ఆచూకీ గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
మొబైల్ షాపుకు కన్నం వేసి 5 లక్షల విలువైన ఫోన్లు చోరీ..
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు వానలే వానలు..
Read Latest Telangana News And Telugu News