Share News

Malabar Gold Manufacturing Unit: పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:15 PM

తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

Malabar Gold Manufacturing Unit: పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
TG CM Revanth Reddy

హైదరాబాద్, జులై 03: హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామన్నారు. మహేశ్వరంలో ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు.


ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలు మార్చలేదని గుర్తు చేశారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి యూనిట్ ఏర్పాటు చేసిన మలబార్ గ్రూప్‌నకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.


హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ చీఫ్..

తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌కు ఖర్గే చేరుకున్నారు.

అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ కానున్నారు. అందుకోసం వారికి ఖర్గే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కాగా, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, తదితరులు ఇప్పటికే తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అలాగే తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్థాస్ జానయ్య సైతం ఖార్గేతో భేటీ కానున్నారు.


జులై 4వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో పార్టీ కార్యకర్తలతో భారీ సభ జరగనుంది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు క్యాడర్‌కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కేడర్‌ను ఈ సభకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు శుక్రవారం జరగనున్న ఈ సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 06:42 PM