CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. కేంద్రమంత్రికి వినతి పత్రం
ABN , Publish Date - Jul 08 , 2025 | 07:28 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా సమావేశం అవుతున్నారు.
న్యూఢిల్లీ, జులై 08: న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అవుతున్నారు. అందులోభాగంగా మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని ఆయనకు సీఎం వినతి పత్రం అందజేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందులోభాగంగా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (NICDIT) ఆమోదించిన రూ. 596. 61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం అందించాలని అడిగారు. హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభ్యర్ధించారు. హైదరాబాద్ - బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫిజిబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
ఆదిభట్లలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రత్యేక రక్షణ, ఏరోస్పేస్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని.. వాటికి సైతం మోదీ ప్రభుత్వం మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలంకు పోటెత్తిన పర్యాటకులు..
కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు జల హారతి..
Read Latest Telangana News And Telugu News