KTR Slams CM Revanth Reddy: ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారమట: కేటీఆర్
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:39 PM
సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ వరుస విమర్శలు చేశారు. 'ఓట్లు కాదు.. ప్రజల పాట్లు చూడండి' అంటూ సీఎం రేవంత్ బిహార్ ఎన్నికల ప్రచారంపై సెటైర్లు వేశారు. ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లారంటూ..
హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస విమర్శలు చేశారు. 'ఓట్లు కాదు.. ప్రజల పాట్లు చూడండి' అంటూ.. రేవంత్ రెడ్డి బిహార్ ఎన్నికల ప్రచారంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ఎక్స్' లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.
'భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బిహార్లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం రాష్ట్రానికి సంబంధమే లేని ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రి వర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లింది. అధిష్ఠానం ఆశీస్సులతో పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు' అంటూ కేటీఆర్ విమర్శలు కురిపించారు.
'వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల వరద నీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో, లేదో ?' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
'కాంగ్రెస్ నేతలారా ఓట్లు కాదు, ప్రజల పాట్లు చూడండి. ఎన్నికలు కాదు, ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి' అంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News