Share News

KCR: ఆ రోజే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్: కేసీఆర్..

ABN , Publish Date - Mar 07 , 2025 | 09:44 PM

బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, పార్లమెంట్‌లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని కేసీఆర్ చెప్పారు.

KCR: ఆ రోజే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్: కేసీఆర్..
KCR

సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలపై రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ (BRS Party) పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ (Yerravalli Farm House)లో పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పని చేస్తుందని ఆరోపించారు.


బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, పార్లమెంట్‌లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని కేసీఆర్ చెప్పారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందని, వరంగల్‌లో భారీ బహిరంగ సభ తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సాయి వరకూ బలపర్చాలని సూచించారు. నూతన కమిటీలతో ప్రతినిధుల సభ ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ కోసం త్వరలోనే నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పుకొచ్చారు.


కాగా, బీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, పార్టీ బహిరంగ సభపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రతి జిల్లాలోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను వరంగల్ సమావేశానికి తరలించాలని చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్ధులై మరింతగా పోరాడుతామని నేతలతో అన్నారు.


బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని, రాష్ట్ర ప్రజల గుండెల్లో నెలువై ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రక్షణ కవచం బీఆర్ఎస్ అని, దాని రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములే అని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. మరోవైపు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని పార్టీ నేతల దగ్గర కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Delimitation Issue: ఆ అంశంపై తొలిసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీకి గట్టి కౌంటర్..

Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..

Updated Date - Mar 07 , 2025 | 09:51 PM