kalvakuntla Kavitha Letter: కాంగ్రెస్ వదిలిన బాణం..
ABN , Publish Date - May 23 , 2025 | 03:11 PM
kalvakuntla Kavitha Letter: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లేఖ హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖపై బీజేపీ ఎంపీలు స్పందించారు.

హైదరాబాద్, మే 23: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖపై ఇప్పటికే రేవంత్ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు స్పందించారు. తాజా కవిత లేఖపై బీజేపీ సైతం స్పందించింది. ఆ క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తెలంగాణను విఫలం చేశాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వారంత కలిసి బీజేపీని నిందిస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలనను తమ పార్టీ నిత్యం వ్యతిరేకిస్తునే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది గాంధీ ఫ్యామిలీ అయినా.. కల్వకుంట్ల ఫ్యామిలీ అయినా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు వారి వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగంగా మార్చడానికి ప్రయత్నిస్తాయన్నారు. ప్రజలను బీజేపీ జైలుకు పంపదన్నారు. చట్టం మాత్రమే పంపుతుందని చెప్పారు. ఎవరైనా దోషి అయితే.. వారిని ఏదీ రక్షించ లేదన్నారు. కానీ ఈ అంశాన్ని తెలంగాణ చూస్తుందని.. ఆ క్రమంలో ఈ డ్రామాను తీవ్రంగా పరిగణించడం లేదని తెలిపారు.
అయితే ప్రతీ సర్వేలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. శబ్దం లేకుండా, అధికారం లేకుండా, కేవలం ప్రజల నమ్మకంతోనే తమ పార్టీ ప్రజల్లో అంతర్లీన ప్రవాహంగా వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజమైన మార్పుతోపాటు అభివృద్ధిని సైతం కోరుకుంటున్నారని తెలిపారు. రాజకీయం.. కుటుంబ డ్రామా కాదన్నారు. ఆ మార్పు బీజేపీతోనే అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇక కల్వకుంట్ల కవిత లేఖపై బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్ రావు స్పందించారు. కవిత లేఖ రాజకీయ పంచాయితీనా? ఆస్తుల పంచాయితీనా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయన్నారు. కవిత లేఖ డ్రామా వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు నిజమని తెలుస్తోందన్నారు. కవితను బయటకు పంపేందుకే కేటీఆర్, హరీశ్‌రావు ఒకటయ్యారని తెలిపారు. ఎవరు ఏం చేసినా తెలంగాణలో మాత్రం బీజేపీదే అధికారమని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
పట్టపగలు బహిరంగంగా తిరుగుతున్న ఉగ్రవాదులు
For National News And Telugu News