Arikepudi Gandhi Vs Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికెపూడి
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:09 PM
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణకు సిద్ధమా? అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు.
హైదరాబాద్, నవంబర్ 02: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణకు సిద్ధమా? అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. ఆదివారం తనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలపై పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ విలేకర్ల ఎదుట స్పందించారు.
ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. తనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేసిన భూమి అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూములతో ఎస్ఎఫ్‌సీకీ సంబంధం లేదని హైకోర్టు చెప్పిందని ఈ సందర్భంగా అరికెపూడి గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే.. అందుకు సంబంధించిన వివరాలను తాను ఇచ్చే వాడినన్నారు.
హైదరాబాద్ గాజులరామారంలోని 307 సర్వే నంబర్‌లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాధవరం కృష్ణారావు, దాసోజ్ శ్రవణ్ తదితరులు గతంలో ఫిర్యాదు చేశారు. సదరు స్థలంలో బడాబాబుల్లో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ను కోరారు. ఈ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వ వద్దంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సైతం వారు కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం రూ. వేల కోట్ల విలువైన ఈ 320 ఎకరాల భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేశారంటూ వారు ఆరోపించారు. అయితే దీనిపై ఆ వెంటనే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా తనపైన, తన కుటుంబ సభ్యులపైనా కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపితమైనవి ఆయన కొట్టిపారేశారు.
గాజులరామారం సర్వే నంబర్ 307 (పార్ట్)లోని భూమి, ల్యాండ్ రికార్డ్ చట్టం ప్రకారం అమ్మకందారులకు ‘‘రిటైనబుల్ ల్యాండ్’’గా వచ్చిన దాన్ని తాము కొనుగోలు చేశామని చెప్పారు. 1991 నుంచీ రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి పట్టా భూమిగానే ఉందని గుర్తు చేశారు. 1991లో పట్టా భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం మ్యూటేషన్ అయిన 11 ఎకరాలను తాను రాజకీయ జీవితం ప్రారంభించక ముందే 2006లో చట్టబద్ధంగా కొనుగోలు చేశానని అరికెపూడి వివరించారు.
2008లో అమ్మకందారుల్లో ఒకరు ఏపీఎస్ఎఫ్‌సీ నుంచి జోక్యం ఉంటుందనే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించారని చెప్పుకొచ్చారు. ఏపీఎస్ఎఫ్‌సీ తన కౌంటర్ అఫిడవిట్‌లో ఈ భూమి వారిది కాదని స్పష్టం చేసిందని తెలిపారు. వేరొక పిటిషన్‌లో ఆ భూములు ఇనాం భూములు కాదని న్యాయబద్ధంగా నిర్ధారించినట్లు ఆయన వివరించారు. సెప్టెంబరు 21న హైడ్రా అధికారులు తమకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, తమ భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్‌ను కూల్చివేశారని, దీంతో తాము హైకోర్టును ఆశ్రయించగా, దానిపై హైడ్రా ప్రవేశం లేకుండా ఉత్తర్వులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.
కొంతమంది రాజకీయ సహచరులు తప్పుడు ఆరోపణలతో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని.. వాటిలో ఒకటి డిస్మిస్ అయిందని తెలిపారు. మరొకటి తన అప్పీల్‌తో కలిసి కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు హైడ్రా నుంచి గానీ.. రాజకీయ సహచరుల నుంచి గానీ ఎటువంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. సహేతుకమైన ఆరోపణలు చేసిన వారికి.. తమ అధీనంలోని భూమిని ప్రైవేట్ పట్టా భూమి అని నిరూపించేందుకు తాను సిద్ధమని అరికెపూడి గాంధీ గతంలో స్పష్టం చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్తీక పౌర్ణమి.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు..
For More TG News And Telugu News