Tummala Nageswara Rao: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:24 PM
Tummala Nageswara Rao: దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతుల పట్ల బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం తీసుకున్న రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో.. అదే రీతిన కోట్లాది రూపాయిలు రుణాలు తీసుకున్న వారి పట్ల ఎందుకు వ్యవహరించడం లేదని బ్యాంకర్లకు మంత్రి సూటిగా ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తీసుకున్న రుణం చెల్లించలేదనే ఒకే ఒక్క కారణంగా సామాన్య రైతుల పట్ల బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడకండ మండలం రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన బ్యాంకర్ల తీరును ఆయన తప్పు పట్టారు. శుక్రవారం హైదారబాద్‌లో నాబార్డ్ స్టే్ట్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు తుమ్మల నాగేశ్వరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను మంత్రులు ఆవిష్కరించారు.
పేపర్లో చూశా..
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సామాన్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగా బ్యాంకర్లకు ఆయన చురకలంటించారు. రుణం తీర్చలేదని రైతు ఇంటి గేటును బ్యాంకర్లు తీసుకెళ్లినట్లు పేపర్లో చూశానని ఆయన పేర్కొన్నారు.
వారిని ఏం చేస్తున్నారు?
అయితే మరి వేల కోట్లు రూపాయిలు బ్యాంకుల్లో అప్పుగా తీసుకొని.. ఆ రుణాన్ని చెల్లించని వారిని ఏం చేస్తున్నారని ప్రజలు తమను నిలదీస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అలాంటి వారి వద్ద నుంచి నగదును ఎందుకు రికవరీ చేయలేక పోతున్నారని ఈ వేదిక మీద నుంచి బ్యాంకర్లను సూటిగా తుమ్మల ప్రశ్నించారు. బ్యాంకింగ్ రంగం.. వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు.
వారిని గౌరవించండి చాలు..
అలాగే బ్యాంకులకు వచ్చే రైతులను గౌరవించాలని బ్యాంకర్లను ఆయన కోరారు.రైతలంటే అడుక్కునే వారు.. బ్యాంకులంటే ఇచ్చే వారు అనే భావనతో ఉండ వద్దని బ్యాంకర్లకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. రైతులంటే ఈ వ్యవస్థను రక్షించేవారని మంత్రి తుమ్మల అభివర్ణించారు.
Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
రైతులకు ఇచ్చిన లోన్ ఎంత?
అయినా రైతులకు బ్యాంకులు ఇచ్చిన లోన్ ఎంత? అందులో వారు ఎగ్గొట్టింది ఎంత శాతమని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బ్యాంకులు ఇచ్చిన వ్యవసాయేతర రుణం ఎంత? వాళ్లు ఎగ్గొట్టింది ఎంత? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని బ్యాంకర్లకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
For Telangana News And Telugu News