Tribal Woman Delivery: ప్రభుత్వ వైద్యానికి భయపడి పత్తిచేనులో దాకున్న గర్భిణీ..
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:20 PM
ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు ఆదిలాబాద్ జిల్లా దహిగూడలోని ఓ ఆదివాసీ గర్భిణీ నిరాకరించింది. వైద్య సిబ్బంది రావడంతో భయంతో పత్తి చేనులో దాక్కుంది.
ఆదిలాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తుంటాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నూతన భవనాలు, వైద్య సిబ్బంది, ఔషధాలు వంటివి సమకూర్చుతుంటాయి. ఇలా ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఇప్పటికీ కొంతమంది పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటేనే ఒణికిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రభుత్వ వైద్యం మీద ఉన్న తన అభిప్రాయాన్ని ఓ గర్భిణీ బాహాటంగా బయటపెట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దహిగూడలో జరిగింది.
ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు ఆదిలాబాద్ జిల్లా దహిగూడలోని ఓ ఆదివాసీ గర్భిణీ నిరాకరించింది. వైద్య సిబ్బంది రావడంతో భయంతో పత్తి చేనులో దాక్కుంది. ఆమెను ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అంకోలి పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది దహిగూడ గ్రామానికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి గర్భిణీ ఇంట్లో లేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఎక్కడికి వెళ్లిందో కుటుంబ సభ్యులకూ తెలియకపోవడంతో.. అందరూ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆమె జాడ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా లభ్యం కాలేదు.
వైద్యసిబ్బంది వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న గర్భిణీ భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సిబ్బంది తెలుసుకున్నారు. ఇంటి నుంచి వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పత్తిచేనులో తలదాచుకున్నట్లు చెప్పారు. వెంటనే పంటచేనులో కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు గంటసేపు వెతకగగా పత్తిచేనులో కుమారునితోపాటు మొక్కల మధ్య దాక్కుని ఉన్న గర్భిణీని గుర్తించామని పేర్కొన్నారు. తమతోపాటు ఆసుపత్రికి రావాలని కోరగా.. మహిళ నిరాకరించిందని ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. తరలించిన గంటలోపే ఆరోగ్యవంతమైన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్