Hyderabad: ఓఆర్‌ఆర్ లోపల కల్లు అమ్మకాలు బంద్?
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:47 AM
హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూతపడనున్నాయా? కల్తీ కల్లును అరిట్టాలంటే.. అసలు కల్లు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కల్లు దుకాణాల ఎత్తివేత దిశగా ప్రభుత్వ ఆలోచన
కల్తీ కల్లును అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని
సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు
ఓఆర్‌ఆర్ లోపల ప్రస్తుతం 454 కల్లు దుకాణాలు
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో మహిళ మృతి
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూతపడనున్నాయా? కల్తీ కల్లును అరిట్టాలంటే.. అసలు కల్లు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? తాటి, ఈత చెట్లు లేని చోట పెద్ద ఎత్తున కల్లు ఎక్కడి నుంచి వస్తుందన్న అంశంపై దృష్టి సారించిందా? కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు సేవించి 10 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని కల్లు దుకాణాల అనుమతులు రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ లోపల కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 454 కల్లు దుకాణాలు ఉన్నాయి. 2004లో కల్తీ కల్లు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెట్లు లేని చోట కల్లు విక్రయాలు ఎలా చేస్తారనే కారణంతో నగరానికి 50 కి.మీ వరకు కల్లు విక్రయాలకు అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక రాజధాని పరిధిలో కల్లు విక్రయాలు మళ్లీ మొదలయ్యాయి. 2004లో కల్లు దుకాణాలు ఎందుకు మూతపడ్డాయి.. ఏ కారణంతో విక్రయాలను నిలిపేశారు? అనే అంశాలపై ఆబ్కారీ శాఖ కమిషనర్ అధికారులతో చర్చించారు. 2014లో దుకాణాలు తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి కారణాలను చూపారనే అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ రెండు సందర్భాలలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే ఏ కార్యక్రమాన్ని సహించేది లేదని, ఈగల్ అనే పేరుతో ప్రత్యేక వ్యవస్థనూ ఏర్పాటు చేసి నిఘాను పటిష్ఠం చేసింది. ఇలాంటి తరుణంలో కల్తీ కల్లు తాగి కూకట్‌పల్లిలో పది మంది మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. తాటి చెట్లు లేనిచోట కల్లు విక్రయాలను నిలిపేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కల్తీ కల్లు విక్రయాలను నిలువరించాలంటే విక్రయాలను అడ్డుకోవడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆబ్కారీ శాఖ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. కల్తీ కల్లు ఘటన అనంతరం ఓఆర్‌ఆర్ లోపల ఎన్ని కల్లు దుకాణాలు ఉన్నాయనే వివరాలను కూడా ప్రభుత్వం తెప్పించుకుంది. ఓఆర్‌ఆర్ లోపల కల్లు విక్రయాలను నిలిపేస్తే హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, మేడ్చల్, షాద్‌నగర్, సరూర్‌నగర్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న కల్లు విక్రయ కేంద్రాలన్నీ మూతపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఔటర్ లోపల కల్లు విక్రయాల పరిస్థితి ఇదీ..
కూకట్‌పల్లి ఘటన అనంతరం లిక్కర్‌తోపాటు కల్లు అమ్మకాలు ఎంత మేరకు జరుగుతున్నాయనే అంశంపై అధికారుల్లో చర్చ జరిగింది. ఓఆర్‌ఆర్ లోపల లిక్కర్ అమ్మకాలతో సమానంగా కల్లు విక్రయాలు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు.. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ లోపల తాటి కోఆపరేటివ్ సొసైటీలు 390 ఉన్నాయి. అందులో హైదరాబాద్ నగరంలో 14 ఉన్నాయి. ఈ సొసైటీల పరిధిలో 53 కల్లు దుకాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 31 సంఘాలు ఉంటే వాటి కింద 50 దుకాణాలు, రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లా మల్కాజిగిరి పరిధిలో 77 సంఘాలు ఉండగా, వాటి పరిధిలో 79 దుకాణాలు ఉన్నాయి. మేడ్చల్ పరిధిలో 50 సంఘాలు ఉంటే వాటి పరిధిలో 52 దుకాణాలు, సరూర్‌నగర్ పరిధిలో 158 సంఘాలు ఉంటే 158 దుకాణాలు, శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 390 సంఘాల పరిధిలో 454 దుకాణాల్లో కల్లు విక్రయాలు జరుగుతున్నాయని ఆబ్కారీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న టీఎ్‌ఫటీ (ట్రీ ఫర్ ట్రేడ్) అనుమతులకు సంబంధించి ఔటర్ లోపల ఉన్న కల్లు దుకాణాలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కింద 6, సికింద్రాబాద్ 6, రంగారెడ్డి 21 ఎక్సైజ్ స్టేషన్లు కలిపి 33 స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలన్నీ రద్దు కానున్నట్లు సమాచారం. ఎక్సైజ్, టీజీ న్యాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ నిఘా విభాగం అన్ని కలిసి పటిష్ఠ నిఘా పెడుతున్నా.. కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ర్పా జోలం, డైజీఫాం, హైడ్రోక్లోరైడ్ వంటి మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్ లోపల కల్లు విక్రయాల అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన.. మరో మహిళ మృతి

కేపీహెచ్‌బీకాలనీ, హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. కూకట్‌పల్లి ఇందిరాహిల్స్‌కు చెందిన సునీత(42) అనే మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారని కూకట్‌పల్లి ఎస్సై నరసింహ తెలిపారు. జూలై 5న ఇందిరానగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగిన సునీత.. మరుసటి రోజు తన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా ఇంద్రకల్‌కు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురవ్వగా కుటుంబసభ్యులు ఏడో తేదీన నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సునీతను ఈ నెల 15న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా, పాల ప్యాకెట్ల తరహాలో గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్‌లోని ఓ హోటల్‌లో కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న 270 లీటర్ల కల్లు ప్యాకెట్లను సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క, సైదాబాద్ ప్రాంతంలో అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద 750 లీటర్ల కల్లును స్వాధీనం చేసకున్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి