Share News

Hyderabad: డ్రైనేజీ లీకేజీలకు చెక్‌ పెట్టే పరికరం

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:10 AM

రాజధాని హైదరాబాద్‌ మహానగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి.. డ్రైనేజీ లీకేజీ. చిన్న చిన్న గల్లీల నుంచి ప్రధాన రహదారుల దాకా.. పేదలు ఉండే బస్తీల నుంచి సంపన్నులు ఉండే ప్రాంతాల దాకా..

Hyderabad: డ్రైనేజీ లీకేజీలకు చెక్‌ పెట్టే పరికరం

  • మురుగునీరు 22 సెంటీమీటర్లకు రాగానే అలర్ట్‌

  • విషవాయువులను పసిగట్టి హెచ్చరించే ఆవిష్కరణ

  • ఓయూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల అద్భుత సృష్టి

ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ మహానగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి.. డ్రైనేజీ లీకేజీ. చిన్న చిన్న గల్లీల నుంచి ప్రధాన రహదారుల దాకా.. పేదలు ఉండే బస్తీల నుంచి సంపన్నులు ఉండే ప్రాంతాల దాకా.. డ్రైనేజీ లీకై మురుగు నీరు ఏరులై పారే దృశ్యాలు సర్వసాధారణం. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లీకేజీలను గుర్తించి శుభ్రం చేయడంలో పారిశుధ్య కార్మికులు అవస్థలు పడుతుంటారు. గుర్తించాక.. ఆ సమస్యను పరిష్కరించడానికి వారు మ్యాన్‌హోల్స్‌లో దిగి అందులో నుంచి వచ్చే విషవాయువుల వల్ల మృతి చెందిన ఘటనలు ఎన్నో. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే అద్భుతమైన పరికరాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని మ్యాన్‌హోల్‌లో అమర్చి.. సంబంధిత అధికారుల వాట్సాప్‌ నంబర్లకు అనుసంధానం చేస్తే చాలు. మురుగునీటి స్థాయి 22 సెంటీమీటర్లకు చేరగానే ఆయా నంబర్లకు అలర్ట్‌ వస్తుంది. 28 సెంటీమీటర్లు దాటితే.. మురుగునీరు పొంగి ప్రవహిస్తుందని హెచ్చరిక జారీ చేస్తుంది. ఈ హెచ్చరికల ఆధారంగా ఆయా విభాగాల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని డ్రైనేజీ లీకేజీని ముందే అరికట్టవచ్చు. అందులో విషవాయువుల గురించి ఈ పరికరం ముందే హెచ్చరించడం వల్ల తగు జాగ్రత్తలు పాటించి పారిశుధ్య కార్మికుల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ శశికాంత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ పరికరాన్ని రూపొందించారు. ఇటీవల చండీగఢ్‌లో నిర్వహించిన సస్టెయినబుల్‌ స్మార్ట్‌ సిటీస్‌ అంతర్జాతీయ సదస్సులో దీనిని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది.


జీహెచ్‌ఎంసీ సహకరిస్తే..

ఈ పరికరంతో డైనేజీ లీకేజీలను ముందుగా గుర్తించొచ్చు. విషవాయువుల నుంచి పారిశుధ్య కార్మికుల ప్రాణాలను కాపాడొచ్చు. దీనిని ప్ర స్తుతం ప్రయోగాత్మకంగా రూపొందించాం. జీహెచ్‌ఎంసీ సహకరిస్తే దీన్ని మరింతగా అభివృద్ధి చేయొచ్చు. ఈ పరికరం తయారు చేయడానికి కేవలం రూ.2,500 ఖర్చవుతుంది. త్వరలో పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయబోతున్నాం.

- ప్రొఫెసర్‌ శశికాంత్‌, అధ్యాపకుడు, ఓయూ ఇంజనీరింగ్‌ విభాగం


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 05:10 AM