Share News

CCMB: మరణం అంచున పునరుజ్జీవం!

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:52 AM

ఒక కణం చనిపోవడం ప్రారంభించిన తరువాత ఆ ప్రయాణాన్ని రివర్స్‌ చేయడం అసాధ్యం అనే నమ్మకాన్ని వమ్ము చేసే విషయం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెల్లడైంది.

CCMB: మరణం అంచున పునరుజ్జీవం!

  • కణాలకు ఆ శక్తి ఉంటుందని గుర్తించిన సీసీఎంబీ శాస్త్రజ్ఞులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఒక కణం చనిపోవడం ప్రారంభించిన తరువాత ఆ ప్రయాణాన్ని రివర్స్‌ చేయడం అసాధ్యం అనే నమ్మకాన్ని వమ్ము చేసే విషయం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెల్లడైంది. మరణం అంచున్న ఉన్నా కూడా తమంతతామే పునరుజ్జీవం పొందే అంతర్గత విధానం కణాల్లో ఉంటుందని సీసీఎంబీకి చెందిన డాక్టర్‌ సంతోష్‌ చౌహాన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఈ ప్రక్రియ కణాల పెరుగుదలను అనుకరిస్తుందని వారు పేర్కొన్నారు. కణాల్లో జరిగే ఈ ప్రక్రియను వారు ‘ప్రోగ్రామ్‌డ్‌ సెల్‌ రివైవల్‌’గా అభివర్ణించారు. ఈ ప్రక్రియ పలు జీవుల్లో కణజాలాల మరమ్మతు, పునరుద్ధరణను వేగవంతం చేస్తుందని వారు పేర్కొన్నారు. కణాలు అలా పునరుజ్జీవం పొందడం యాదృచ్చికంగా జరిగే ప్రకియ్ర కాదని.. చనిపోయే కణాలు తమనుతాము పునరుజ్జీవింపజేసుకోవడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన ప్రక్రియలనూ (అభివృద్ధి, జీవక్రియ, రోగనిరోధక శక్తి మార్గాలను) రీబూట్‌ చేసుకుంటాయని డాక్టర్‌ చౌహాన్‌ వెల్లడించారు.


ఎలుకల్లో చర్మంపై గాయాలు, కాలినగాయాలు వేగంగా నయం కావడానికి.. చిరుకప్పల్లో తోక పునరుత్పత్తిని ఉత్తేజితం చేయడానికి, సీ-ఎలిగాన్స్‌లో నాడుల మరమ్మతులను ప్రోత్సహించడంలో.. ఫ్రూట్‌ఫ్లై్‌సలో రక్త మూలకణాల ఉత్పత్తిని పెంచడంలో ఈ ప్రోగ్రామ్‌డ్‌ సెల్‌ రివైవల్‌ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతోందని డాక్టర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ రెస్క్యూ మెకానిజం అన్ని జీవుల కణాల్లోనూ అంతర్గతంగా ఉంటుందని.. గాయాలు నయం చేయడానికి, దెబ్బతిన్న కణజాలాలకు మరమ్మతు చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. అదే సమయంలో.. ఈ మెకానిజం క్యాన్సర్‌ చికిత్సలను మరింత క్లిష్టతరం చేస్తుందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా క్యాన్సర్‌ చికిత్సల ప్రధాన లక్ష్యం క్యాన్సర్‌ కణాలను చంపడమే. కానీ, ఆ కణాలు ఈ మెకానిజంతో బతికితే క్యాన్సర్‌ కణితులు చికిత్సకు స్పందించకుండా పోయే ప్రమాదం ఉందని డాక్టర్‌ చౌహాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాయాలను నయం చేయడానికి, డీజెనరేటివ్‌ డిసీజ్‌లను నయం చేయడానికి, అవయవాల పునరుత్పత్తికి సంబంధించి కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి తాము గుర్తించిన ఈ అంశాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 04:52 AM