Hyderabad: రూ.500లోపు బిల్లున్నా.. కనెక్షన్ కట్!
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:13 AM
హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. కొంతమంది సిబ్బంది వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నారు. కేవలం రూ.500లోపు బిల్లు పెండింగ్ ఉంటే వెంటనే కనెక్షన్ కట్ చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.
- విద్యుత్ బిల్లుల వసూళ్లలో బిల్‌కలెక్టర్ల అత్యుత్సాహం
- రూ.లక్షల్లో బిల్లులు వదిలేసి సామాన్యులపై ప్రతాపం
- బస్తీలు, కాలనీల్లో హడావిడి
హైదరాబాద్ సిటీ: మియాపూర్ అంబేడ్కర్‌నగర్ బస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు విద్యుత్ బిల్లు వసూళ్లకు వచ్చిన వ్యక్తి.. వినియోగదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా బిల్లు పెండింగ్ ఉన్న మీటర్ల వద్ద పవర్ ఆఫ్ చేసుకుంటూ పోయాడు. కరెంట్ ఎందుకు పోయిందో తెలియక కిందకు వచ్చి చూస్తే మీటర్ వద్ద స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇంతకీ వారు బకాయి ఉన్న బిల్లులు రూ.520, రూ.540, రూ.630.. ఇలా అన్నీ సుమారు వెయ్యిలోపే. కనెక్షన్లు తొలగించే సమయంలో ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్నారు. రేపు కడతామని కోరినా బిల్ కలెక్టర్ అంగీకరించలేదు.

తప్పనిస్థితిలో ఇంట్లో ఉన్న డబ్బులు పోగేసుకుని అతడి వద్దకెళ్తే, క్యాష్ కాదు.. ఫోన్ పేలో కట్టాలన్నారు. ‘అన్నా.. మాకు ఫోన్‌లో కట్టడం రాదు. పోని రేపు మా వాళ్లు కట్టే వరకు ఆగండన్నా’ అని బతిమలాడినా ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా, మరోచోట బిల్లు చెల్లించిన వినియోగదారుడు మీటర్ దగ్గర స్విచ్ ఆన్ చేయగా ‘మీరెందుకు ఆన్ చేశారు.. రూల్స్ మాట్లాడితే నోటీసులు పంపిస్తా..’ అని హెచ్చరించడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. బిల్లు కట్టినా బెదిరింపులకు దిగడం ఏంటని బిక్కముఖం వేశాడు. ఇక్కడే కాదు.. చాలా మంది బిల్ కలెక్టర్లు బస్తీలు, కాలనీల్లోని సామాన్యులపైనే ప్రతాపం చూపుతున్నారు. అధిక బకాయిలు ఉన్నప్పటికీ బడా బాబుల జోలికి పోవడం లేదు.
రూ.350 కోట్ల బకాయిల సంగతేంటి?
గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో నవంబరు నాటికి రూ.350 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలున్నాయి. పది సర్కిళ్లలో అత్యధికంగా హైదరాబాద్ సౌత్, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనే రూ. 200 కోట్ల బకాయిలు ఉన్నాయి. సైబర్‌సిటీ, హైదరాబాద్ సెంట్రల్, హబ్సిగూడ సర్కిళ్లలో రూ.120 కోట్ల విద్యుత్ బకాయిలున్నాయి. పలు డివిజన్లలో రూ.10 వేల నుంచి 50 వేల వరకు కూడా బకాయి ఉన్న సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వసూళ్లకు ఉన్నతాధికారులు కానీ, బిల్ కలెక్టర్లు కానీ కఠిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. పాత బకాయిల వసూళ్లపై ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తుండటంతో పలువురు సిబ్బంది ఒకటి, రెండు నెలలు బిల్లులు చెల్లించకపోయినా విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామంటూ బస్తీల్లో బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News