Hyderabad: డబ్బుల కోసం కిడ్నాప్.. దొరికిపోతామని దారుణ హత్య
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:21 AM
హైదరాబాద్ నగరానికి చెందిన పాన్‌మసాలా బడావ్యాపారి బొల్లు రమేశ్(51) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు.

హైదరాబాద్‌లో పాన్‌మసాలా వ్యాపారి అపహరణ
కారులో తీసుకెళ్తూ డబ్బు డిమాండ్ చేసిన నిందితులు
రూ.15 లక్షలు అకౌంట్‌కు బదిలీ చేసినా వదలని వైనం
కారులోనే ఖమ్మం జిల్లా కూసుమంచి వచ్చి అక్కడ హత్య
దాదాపు వారం రోజుల తర్వాత వెలుగులోకి ఘటన
నిందితుల్లో ఒకరు పాన్‌మసాలా వ్యాపారి వద్ద సబ్ డీలర్
కూసుమంచి, జనవరి24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరానికి చెందిన పాన్‌మసాలా బడావ్యాపారి బొల్లు రమేశ్(51) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన నిందితులు... రూ. 15 లక్షలిచ్చినా రమేశ్‌ని వదిలిపెట్టలేదు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో రహదారి పక్కన మిర్చితోటలో ఈ ఘటన జరిగింది. హత్య ఈనెల 19వ తేదీ తెల్లవారుజామునే జరిగింది. శుక్రవారం ఉదయం దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీసులు మృతుడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూసుమంచి చేరుకున్నారు. మృతదేహం రమేశ్‌దిగా గుర్తించారు. కార్ఖానా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన బొల్లు రమేశ్ తెలుగు రాష్ట్రాల్లో పాన్‌మసాలా వ్యాపారం చేస్తున్నారు.
ఆయన సబ్‌డీలర్లకు సరుకు విక్రయిస్తుంటారు. కార్ఖానాలో సబ్ డీలర్‌గా ఉన్న సాజిద్.. రమేశ్ వద్ద భారీగా డబ్బులున్నట్లు గుర్తించాడు. రమేశ్‌ను కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురిని రమేశ్ వద్దకు తీసుకుని వెళ్లాడు. వాళ్లకు కూడా గుట్కాలు కావాలని నమ్మబలికాడు. అనంతరం.. రమేశ్‌ను కారులో ఎక్కించుకుని కాళ్లు చేతులు కట్టేశారు. డబ్బులివ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో రమేశ్.. రూ. 15లక్షలను వారి అకౌంట్‌లోకి బదిలీ చేశారు. రమేశ్‌ను వదిలేస్తే తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తాడని భావించి అతడిని చంపేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు. కారును హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కనే మిర్చితోటలోకి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకుండా తాళ్లతో, కండువాతో గట్టిగా గొంతునులిమి చంపేశారు. బండరాయితో మోదారు. చనిపోయాడని నిర్ధారించుకుని వెళ్లారు.
ఈ నెల 19వ తేదీనే మిస్సింగ్ కేసు
బొల్లు రమేశ్ ఈ నెల 18వ తేదీన ఇంట్లోనుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి భార్య జనని ఫిర్యాదు చేయడంతో కార్ఖానా పోలీసులు మిస్సింగ్ కేసునమోదు చేశారు. ఈక్రమంలో అతడి ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేశారు. అనుమానితుడుగా ఉన్న సాజిద్‌ను గుర్తించి తమదైన శైలిలో విచారించారు. మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు సాజిద్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రమేశ్‌ను చంపేసి సుమారు ఆరు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఈక్రమంలో మృతదేహాం తరలించేందుకు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులను ఇక్కడికే తీసుకవచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు ఖమ్మానికి చెందిన అన్నం శ్రీనివాసరావు ద్వారా ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం