Share News

Nandagiri Hills: నెట్‌ నెట్‌ భవనాన్ని కూల్చాల్సిందే!

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:46 AM

కేబీఆర్‌ పార్క్‌కు కూతవేటు దూరంలో.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్మిస్తున్న భవనం కథ ఇది!! నందగిరి హిల్స్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో జి.అమరేందర్‌ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ 4.748 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

Nandagiri Hills: నెట్‌ నెట్‌ భవనాన్ని కూల్చాల్సిందే!

  • జూబ్లీహిల్స్‌లోని నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు

  • తక్షణమే సరిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఉత్తర్వు

  • సెట్‌బ్యాక్స్‌లోనూ అంగుళమైనా వదలని వైనం

  • 110 అడుగుల లోతుకు తవ్వి 5 అంతస్తులు!

  • 5 మీటర్లకు బదులు 4.5 మీటర్ల ఎత్తుతో శ్లాబులు

  • స్టిల్ట్‌ పైన ఏడు అంతస్తుల శ్లాబులూ 3 మీటర్లకు

  • బదులుగా.. 4.5 మీటర్ల ఎత్తుతో నిర్మాణం

  • సరిదిద్దడమంటే నేలమట్టం చేయడమే: ఇంజనీర్లు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ నిర్మించిన భవనంలో అడుగడుగునా ఉల్లంఘనలే ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తేల్చిన నేపథ్యంలో.. ఆ ఉల్లంఘనలను తక్షణమే సరిచేయాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి గురువారం సంచలన ఉత్తర్వులు ఇచ్చారు! అయితే.. అనుమతించిన ప్లాన్‌ ప్రకారం కాకుండా.. ఇష్టం వచ్చినట్టు, పర్యావరణ సమతుల్యతకు భంగం వాటిల్లేలా చేపట్టిన ఈ నిర్మాణంలో ఉల్లంఘనలను సరిదిద్దడమంటే భవనం కూల్చివేతతో సమానమే అని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. కేబీఆర్‌ పార్క్‌కు కూతవేటు దూరంలో.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్మిస్తున్న భవనం కథ ఇది!! నందగిరి హిల్స్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో జి.అమరేందర్‌ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ 4.748 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.


ఈ స్థలంలో 12 అంతస్తుల (జీ+4, 7 సెల్లార్లు) నిర్మాణం చేపట్టేందుకు 2013లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. ఆ తరువాత 2015లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో 865.42 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసింది. ఇది జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45కు ఆనుకునే ఉంటుంది. కాగా.. సొసైటీకి సంబంధించి కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం 2017లో జీవో నంబరు 305 జారీ చేసింది. దాని ప్రకారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో 30 మీటర్ల వరకు నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ దీని వెనుకాలే ఉన్న హుడా లేఅవుట్‌కు ఈ నిబంధనలు వర్తించవు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి ఇచ్చిన వెసులుబాటును అడ్డుపెట్టుకుని.. నెట్‌నెట్‌ వెంచర్స్‌ సంస్థ తమకు 30 మీటర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు పెట్టుకుంది. అనుమతులు కూడా సాధించింది.


జీ+4తో మొదలుపెట్టి.. ఆ తర్వాత జీ+5, జీ+12, చివరకు జీ+13, వరకు.. 2,09,620 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసుకునేలా అనుమతి పొందింది. ఈ స్థలంలో సెవన్‌ స్టార్‌ హోటల్‌, మల్లీప్లెక్స్‌, షాఫింగ్‌ మాల్‌ నిర్మించాలనేది నెట్‌ నెట్‌ వెంచర్‌ ప్రతిపాదన. అలా నిర్మించడం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధం. అయినా నాంపల్లి సర్కిల్‌-18 పరిధిలో చేపట్టిన ఈ భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ 2023 సెప్టెంబరు 26న అనుమతులు మంజూరు చేసింది. ఇలా అన్ని నిబంధనలనూ ఉల్లంఘించి చేపడుతున్న ఈ నిర్మాణంపై నందగిరి కో ఆపరేటివ్‌ హౌస్సింగ్‌ సొసైటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ నిర్మాణాన్ని పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు.


ఇవీ ఉల్లంఘనలు..

భవన నిర్మాణం చేపట్టిన ప్రాంతం పెద్ద పెద్ద రాళ్లతో అసమతుల్యంగా ఉంటుంది. నేల స్వభావం దెబ్బతినకుండా భవన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా.. నెట్‌ నెట్‌ వెంచర్స్‌ నిర్వాహకులు భూమి లోపలకు సుమారు 110 అడుగులు మేర తవ్వకాలు చేశారు. అక్కడి నుంచి 5 అంతస్తుల స్టిల్ట్‌ నిర్మాణ పనుల విషయంలో, సెట్‌ బ్యాక్స్‌ విషయంలోనూ నిబంధనలు పాటించలేదు. సెట్‌ బ్యాక్స్‌ కోసం 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు వదలాల్సి ఉండగా అంగుళం కూడా వదలకుండా ఆ ప్రాంతంలో కాంక్రీట్‌ గోడలు, ర్యాంపులు నిర్మించారు. అగ్నిమాపక వాహనాలు కూడా తిరిగే అవకాశం లేకుండా 5 అంతస్తుల స్టిల్ట్‌ నిర్మాణాలు చేపట్టారు. స్టిల్ట్‌ నుంచి ఆపైన నిర్మించిన 7 అంతస్తుల విషయంలో 3 మీటర్ల ఎత్తులో ఒక్కో శ్లాబ్‌ వేయాల్సి ఉంటే అక్కడ 4.5 మీటర్ల ఎత్తులో వేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తన 19 పేజీల ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. అనుమతించిన ప్లాన్‌ ప్రకారం కాకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. స్టిల్ట్‌ 5 అంతస్తుల్లోనూ సెట్‌ బ్యాక్స్‌ ప్రాంతంలో ఉన్న కాంక్రీట్‌ నిర్మాణాలను తొలగించాలని.. నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా వాహనాల రాకపోకలకోసం చేపట్టిన ర్యాంపులను తొలగించాలని, కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే భవనం పూర్తిగా కూల్చివేతకు గురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 04:46 AM