Share News

Hyderabad: మహా.. హైదరాబాద్‌!

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:08 AM

రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజీనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది.

Hyderabad: మహా.. హైదరాబాద్‌!

హెచ్‌ఎండీఏ పరిధి మరింత విస్తరణ.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆవల 5 కి.మీ. దాకా

జిల్లా హెచ్‌ఎండీఏలోకి

వచ్చే మండలాలు

హైదరాబాద్‌ 16

రంగారెడ్డి 27

మేడ్చల్‌ మల్కాజిగిరి 15

సంగారెడ్డి 11

యాదాద్రి భువనగిరి 10

నల్లగొండ 6

మెదక్‌ 6

సిద్దిపేట 6

వికారాబాద్‌ 5

మహబూబ్‌నగర్‌ 3

నాగర్‌కర్నూల్‌ 1

  • ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్లలోనే అథారిటీ

  • విస్తరణతో 13 వేల చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం

  • హెచ్‌ఎండీఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు

  • 11 జిల్లాలు, 106 మండలాలు, 43 అర్బన్‌ స్థానిక సంస్థలకు చేరిక

  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్‌

  • త్వరలోనే బోర్డు, మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం

  • పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు

  • నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజీనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్‌తోపాటు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిని పెంచి.. మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు అవతల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది. తద్వారా.. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి.. ఏకంగా 12 వేల నుంచి 13 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. సుమారు ఐదారు వేల చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుండడంతో హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న పది జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజినల్‌ రింగ్‌ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్‌ పెరగగా.. హెచ్‌ఎండీఏ పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది.


త్వరలో హెచ్‌ఎండీఏ బోర్డులో, రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అనంతరం నగర విస్తరణకు అనుగుణంగా 2008లో హుడాను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)గా మార్పు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అందులో హైదరాబాద్‌ జిల్లాతోపాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో హెచ్‌ఎండీఏ పరిధి పెరగకపోయినా.. ఐదు జిల్లాలు ఏడు జిల్లాలుగా మారాయి. వీటిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న షాద్‌నగర్‌.. రంగారెడ్డి జిల్లాలోకి రావడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా హెచ్‌ఎండీఏలో లేకుండా పోయింది. దీంతో ప్రస్తుత హెచ్‌ఎండీఏ పరిధి.. ఏడు జిల్లాలు, 74 మండలాలు, సుమారు వెయ్యి గ్రామపంచాయతీలు, ఎనిమిది కార్పొరేషన్లు, 38కి పైగా మునిసిపాలిటీలతో కూడి ఉంది.


ఆర్‌ఆర్‌ఆర్‌ అవతల ఐదు కిలోమీటర్ల వరకు..

హెచ్‌ఎండీఏ పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌-2031ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే రీజినల్‌ రింగ్‌ రోడ్డును ప్రతిపాదిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను హద్దుగా చేసుకొని హైదరాబాద్‌ను విస్తరించడంతోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలో చేపట్టాల్సిన రీజినల్‌ రింగ్‌ రోడ్డును కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటేస్తూ నిర్ణయించారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అలైన్‌మెంట్‌ కూడా ఖరారయింది. త్వరలోనే దక్షిణ భాగానికీ ఖరారు చేసే అవకాశాలున్నాయి. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిని సైతం ఆర్‌ఆర్‌ఆర్‌పాటు అవతల 5కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఇరువైపులా అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలుండడంతో.. ఆ రోడ్డుకు అవతల కూడా పరిధిని పెంచుతున్నారు. దీంతో ఈ పరిధి 12-13 వేల చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశాలున్నాయి. దీని పరిధిలోని ఏడు జిల్లాలు 11కు పెరగనున్నాయి. కొత్తగా నాలుగు జిల్లాలు నల్లగొండ, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ చేరనున్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు ఇప్పటికే పూర్తిగా ఉండగా.. తాజాగా రంగారెడ్డి జిల్లా పూర్తిగా రానుంది. ఇక యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మండలాలు రానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో పస్తుతమున్న 74 మండలాలకు అదనంగా మరో 32 మండలాలు చేరి 106 మండలాలు కానున్నాయి. జీహెచ్‌ఎంసీ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తోపాటు ఏడు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 34 మునిసిపాలిటీలతో కలిపి మొత్తం 43 అర్బన్‌ స్థానిక సంస్థలు ఉండనున్నాయి.


కోర్‌ అర్బన్‌, సెమీ అర్బన్‌ ఏరియాలుగా

హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ పరిధిని కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించనుంది. దాదాపు 2వేల చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్‌ఎంసీ పరిధి పెరగనుంది. ఈ పరిధిలో జీహెచ్‌ఎంసీతోపాటు 33 గ్రామపంచాయతీలు, 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా వాటన్నింటినీ కోర్‌ అర్బన్‌ ఏరియాగా నిర్ధారించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ ఏరియాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆవల 5కిలోమీటర్ల వరకు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే బాధ్యతలను కూడా హెచ్‌ఎండీఏకు అప్పగించారు. ఈలోపు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ బోర్డు సమావేశం జరపడంతోపాటు క్యాబినెట్‌లో చర్చించి.. అవసరమైతే అసెంబ్లీలో బిల్లును కూడా పెట్టే అవకాశాలున్నాయి.


హెచ్‌ఎండీఏలో కొత్తగా చేరే మండలాలు..

రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో ఐదు మండలాలు తలకొండపల్లి, ఆమనగల్లు, మాడుగుల, కడ్తాల్‌, కేశంపేట చేరనున్నాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 27 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకే రానున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో మూడు మండలాలు చౌటకూర్‌, కొండాపూర్‌, సదాశివపేట రానున్నాయి.

సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే మూడు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో మూడు మండలాలు గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, రాయపోల్‌ చేరనున్నాయి.

మెదక్‌ జిల్లాలో ఇప్పటికే ఐదు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మాసాయిపేట మండలం చేరనుంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే ఐదు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో ఐదు మండలాలు సంస్థాన్‌ నారాయణపురం, వలిగొండ, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి చేరనున్నాయి.


కొత్తగా చేరే జిల్లాల్లోని మండలాలు..

  • వికారాబాద్‌ జిల్లా హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్తగా చేరనుండగా.. ఇందులో ఐదు మండలాలు మాత్రమే రానున్నాయి. మోమిన్‌పేట, నవాబ్‌పేట, పరిగి, పూడూరు, వికారాబాద్‌ మండలాలు కొత్తగా హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానుండగా.. అందులోనూ కొన్ని గ్రామాలే ఉంటాయి.

  • నల్లగొండ జిల్లా హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్తగా చేరనుండగా.. ఇందులో కేవలం 6మండలాలు మాత్రమే రానున్నాయి. వీటిలోనూ గట్టుప్పల్‌ మండలం మినహా చండూరు, చింతపల్లి, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాల్లో కొన్ని గ్రామాలు రానున్నాయి.

  • మహబూబ్‌నగర్‌ జిల్లా హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్తగా చేరనుండగా.. ఇందులో కేవలం మూడు మండలాలు నవాబ్‌పేట, బాలానగర్‌, రాజపూర్‌లలోని కొన్ని గ్రామాలు మాత్రమే రానున్నాయి.

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్తగా చేరనుండగా.. ఇందులో కేవలం వెల్దండ మండలంలోని మూడు గ్రామాలే రానున్నాయి.

Updated Date - Jan 19 , 2025 | 03:08 AM