Share News

Hyderabad Metro Rail: దశ.. దిశ మారనున్న మెట్రో

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:28 AM

హైదరాబాద్‌ మహానగరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో కథ ముగిసింది. ఎన్నో సవాళ్లను దాటుకుని, ప్రతిష్ఠాత్మకంగా దేశంలోనే తొలిసారిగా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో మెట్రోను నిర్మించిన సంస్థ ఇకపై మెట్రో కార్యకలాపాలకు దూరం కానుంది.

Hyderabad Metro Rail: దశ.. దిశ మారనున్న మెట్రో

- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఎల్‌అండ్‌టీ

- అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు.. 8 ఏళ్లకే వెనక్కి

- సంస్థను దెబ్బతీసిన కొవిడ్‌.

- అప్పుల ఊబి నుంచి బయట పడలేక సతమతం..

- మెట్రోతో ముగిసిన ఎల్‌అండ్‌టీ ప్రయాణం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో కథ ముగిసింది. ఎన్నో సవాళ్లను దాటుకుని, ప్రతిష్ఠాత్మకంగా దేశంలోనే తొలిసారిగా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో మెట్రోను నిర్మించిన సంస్థ ఇకపై మెట్రో కార్యకలాపాలకు దూరం కానుంది. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెట్రో ప్రాజెక్టు కొత్త పుంతలు తొక్కనుంది.

2010లో ప్రస్థానం ప్రారంభం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. మొదట్లో సత్యం కంప్యూటర్స్‌కు అనుబంధ సంస్థగా ఉన్న మేటాస్‌ ఇన్‌ఫ్రా కంపెనీ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు 2008లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, సత్యం కంప్యూటర్స్‌ సంక్షోభంతో ఆ ప్రతిపాదన అర్ధాంతరంగా ఆగిపోయింది. అనంతరం ఎల్‌అండ్‌టీ సంస్థతో 2010 సెప్టెంబర్‌ 4న అప్పటి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు కన్సెషన్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. దీంతో ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.


2017లో మెట్రో సేవలు ప్రారంభం..

హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటి దశ సేవలను 2017 నవంబర్‌ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాటినుంచి దశలవారీగా మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. మేరకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్‌, మియాపూర్‌లో రెండు మెట్రో డిపోలను నిర్మించారు.

దెబ్బతీసిన కరోనా

2020లో వచ్చిన కరోనా కారణంగా 169 రోజులపాటు మెట్రో రైళ్ల సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. దీంతో అప్పటి నుంచి తమను ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లించాల్సిన వడ్డీతో అప్పుల భారం పెరిగిపోవడంతో సంస్థ ఆర్థికంగా కొట్టుమిట్టాడింది. దీంతో తాజాగా జరిగిన చర్చల తర్వాత ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ అంగీకరించింది.


city7.2.jpg

రెండో దశకు తొలగిన అడ్డంకులు

మెట్రో బాధ్యతల నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకుంటున్నట్లు సంస్థ అంగీకరించిన నేపథ్యంలో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులు దాదాపుగా తొలగినట్లు తెలుస్తోంది. అయితే మొదటి విడతలోని మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీని ఎలా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతారు, టికెట్‌ షేరింగ్‌ ఎలా ఉంటుంది, ఎండ్‌ టూ ఎండ్‌ ప్రయాణం సాధ్యమవుతుందా, ప్రయాణికులు రైళ్లను మారాల్సి వస్తుందా.. లేదా.. అనే విషయాలపై కేంద్రం ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.


ఈ నేపథ్యంలోనే డీపీఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా ఆపివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మొదటిదశ నిర్వహణను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో రెండోదశలోని అనుమానాలకు ఇక పుల్‌స్టాప్‌ పడిందని మెట్రోవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈక్విటీ వాటాను ఇవ్వాలని కోరుతున్న ఎల్‌అండ్‌టీ హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారాంబాగ్‌లో నిర్మించిన మాల్స్‌ నిర్వహణ తన దగ్గరే పెట్టుకుంటుందా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.


ఎల్‌అండ్‌టీ మెట్రో ఆదాయ, వ్యయాలు

సంవత్సరం ఆదాయం నికర నష్టం

( కోట్లల్లో) (సుమారు రూ. కోట్లల్లో)

2017-18 69.53 58.36

2018-19 318.46 148.00

2019-20 598.20 382.00

2020-21 227.95 1,766.00

2021-22 475.37 1,745.85

2022-23 682.53 1,315.94

2023-24 1399.31 555.04

2024-25 1108.54 625.88


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 10:28 AM