Share News

Hyderabad: ఉగ్రవాది సాజిద్‌కు సిటీతో లింకులేంటి?

ABN , Publish Date - Dec 19 , 2025 | 07:33 AM

ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‏తో లింకులేంటి.. అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సాజిద్‌ సంబంధీకులను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన సోదరుడు వైద్యుడుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.

Hyderabad: ఉగ్రవాది సాజిద్‌కు సిటీతో లింకులేంటి?

- సంబంధీకులను విచారిస్తున్న పోలీసులు

- స్లీపర్‌ సెల్స్‌ను కలిసే అవకాశంపై ఆరా

- సాజిద్‌ తండ్రి ఆర్మీ ఉద్యోగి, సోదరుడు వైద్యుడు

హైదరాబాద్‌ సిటీ: ఆస్ట్రేలియా బాండీ బీచ్‌(Australia Bondi Beach)లో మారణహోమం సృష్టించిన సాజిద్‌ అక్రమ్‌కు నగరంతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చదువుకునే సమయంలోనే అతడు ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడా, లేక నగరానికి వచ్చిన సమయంలో ఎవరైనా స్లీపర్‌ సెల్స్‌ను కలుసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అతడి బంధువులు, సంబంధీకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. టోలిచౌకిలో పుట్టి పెరిగిన సాజిద్‌ అక్రమ్‌ తండ్రి ఆర్మీ ఉద్యోగి.


బీకాం పూర్తి చేసుకున్న అక్రమ్‌ ఉద్యోగ అన్వేషణలో భాగంగా 1988లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే ఉంటున్న యూరోపియన్‌ మహిళ వెనెరా గ్రొస్సోను 1989లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వీరి కుమారుడు నవీద్‌ అక్రమ్‌ (24) తండ్రితో కలిసి మారణకాండలో పాల్గొన్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. పెళ్లి, ఆస్తి పంపకాల విషయంలో కుటుంబసభ్యులతో విబేధాలు రావడంతో సాజిద్‌ అక్రమ్‌ తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో దాదాపు సంబంధాలు తెంచుకున్నట్లు తెలిసింది.


సాజిద్‌ సోదరుడు సాహిద్‌ అక్రమ్‌ ఓల్డ్‌ సిటీలోని ఓ ఆస్పత్రిలో జనరల్‌ ఫిజీషియన్‌గా పని చేస్తున్నాడు. సాజిద్‌ 1998 నుంచి 2022 వరకు ఆరుసార్లు ఆస్ట్రేలియా నుంచి నగరానికి వచ్చాడు. తల్లిదండ్రులను కలుసుకోవడం, ఆస్తుల విక్రయం చేసేందుకు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2022 తర్వాత సాజిద్‌ ఇండియాకు రాలేదు. తండ్రి మరణించినా, కుటుంబంలో ఇతర శుభకార్యాలకు హాజరుకాలేదు.


city2.jpg

సాజిద్‌ సిడ్నీలోని అల్‌మురాద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అరబిక్‌ నేర్చుకునే సమయంలో పరిచయమైన వారి ద్వారా ఐసిస్ కు ఆకర్షితుడై ఉంటాడని భావిస్తున్నారు. దాడికి ముందు సాజిద్‌ అతడి కుమారుడు నవీద్‌ ఫిలిప్పైన్స్‌ వెళ్లి వచ్చినట్లు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు గుర్తించాయి. సాజిద్‌ కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు, నగరంలో ఏదైనా సంస్థ ప్రమేయంతో ఉగ్రవాదం వైపు వెళ్లిన దాఖలాలు లేవని గుర్తించారు. ఆస్ట్రేలియాకు వెళ్లక ముందు సాజిద్‌కు ఎలాంటి నేర చరిత్రా లేదని పోలీసు వర్గాలు తెలిపాయి


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి ధరలు మరింత పైకి!

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2025 | 07:33 AM