Share News

Hyderabad: బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల ప్రచారం..

ABN , Publish Date - Dec 20 , 2025 | 07:42 AM

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని, ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు తమదృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.

Hyderabad: బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల ప్రచారం..

- ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి..

- ఎస్సీపీసీఆర్ చైర్పర్సన్ సీతా దయాకర్..

హైదరాబాద్: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం, అశ్రీత, జిల్లా న్యాయ సేవల సంస్థల ఆధ్వర్యంలో, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సహకారంతో చేపట్టిన 100 రోజులపాటు విస్తృత ప్రచార కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి(Seetha Dayakar Reddy) మాట్లాడుతూ.. బాల్య వివాహాలు పిల్లల మౌలిక హక్కులను తీవ్రంగా హరిస్తాయన్నారు.


సమాజం మొత్తం బాధ్యత తీసుకొని ఈ సామాజిక దుష్ప్రవర్తనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మరో అతిధి మహిళా భద్రత విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లావణ్య జావేద్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నివారణలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. పిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.


city2....jpg

అనంతరం జిల్లా న్యాయ సేవల సంస్థ సభ్యులు, సంకల్పం సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ చౌదరి కోడూరి మాట్లాడుతూ.., బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, బాధితులకు జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంపొందినప్పుడే ఈ దుష్ప్రవర్తనను పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ చట్టాలపై వారికి ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు.


కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందనా, యునిసెఫ్ సీనియర్ కార్యక్రమ నిర్వాహకులు డేవిడ్, వెంకటేశ్వర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్, షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారి, ఖైరతాబాద్ శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి పుష్ప, అశ్రీత మమత, నాట్కో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 07:42 AM