Hyderabad: కర్నూలు ఘటనతో నగరవాసుల కలవరం
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:15 AM
శుక్రవారం తెల్లవారుతుండగానే పిడుగులాంటి వార్తతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. నగరం నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Vemuri Kaveri Travels) బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురై.. 19 మంది సజీవ దహనమయ్యారు.
హైదరాబాద్ సిటీ: శుక్రవారం తెల్లవారుతుండగానే పిడుగులాంటి వార్తతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. నగరం నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Vemuri Kaveri Travels) బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురై.. 19 మంది సజీవ దహనమయ్యారు. పండగ సెలవులకు, విహారయాత్రలకంటూ వచ్చిన కొందరు గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. వారికి ఆనందంగా వీడ్కోలు పలికిన నగరవాసులు ఈ దుర్ఘటన వార్త తెలిసి భయాందోళన చెందారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడంతో 45 మంది సజీవ దహనం అయ్యారు.
ఆ తర్వాత అదే జాతీయ రహదారిపై నేడు మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడం, 19మంది సజీవ దహనం కావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
2021 ఫిబ్రవరిలో షేక్‌పేటకు చెందిన కొట్టం సత్యనారాయణ కుటుంబ సభ్యులు, స్థానిక కుటుంబాలు కలిసి దినేష్ ట్రావెల్స్ బస్సును అద్దెకు తీసుకుని అరకు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘాట్‌రోడ్డులో బస్సు లోయలోకి పడి ఓ చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 22మంది గాయపడ్డారు. ఈ ఘటనలను తలుచుకున్న నగరవాసులు దూర ప్రాంతాలకు ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
ఎక్కడ ఎంత మంది ఎక్కారంటే..
నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పికప్ వ్యాన్‌ల ద్వారా ప్రయాణికులను ట్రావెల్ బస్సు వెళ్లే ప్రధాన మార్గంలో ఎక్కించారు. పటాన్‌చెరు వద్ద ఇద్దరు ప్రయాణికులతో ట్రావెల్ బస్సు రాత్రి8.30 గంటలకు బయలుదేరింది. బీరంగూడ వద్ద ఒకరు, గండిమైసమ్మ దగ్గర ఒకరు, బహదూర్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ఒకరు, సూరారం సాయిబాబా టెంపుల్ వద్ద ఇద్దరు, చింతల్‌లో ఒకరు ఎక్కారు. మియాపూర్ అల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద ఒకరు, నిజాంపేట ఎక్స్ రోడ్డులో ఒకరు,
జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు, మూసాపేట వై జంక్షన్ వద్ద ముగ్గురు, భరత్‌నగర్‌లో ఒకరు, ఎర్రగడ్డలో ఇద్దరు, ఎస్‌ఆర్‌నగర్‌లో ముగ్గురు ఎక్కారు. ప్యారడైజ్‌లో ఇద్దరు, లక్డీకాపూల్ వద్ద ముగ్గురు, నాంపల్లి మెట్రోస్టేషన్ వద్ద ఒకరు, గచ్చిబౌలిలో ఒకరు ఎక్కారు. అలాగే వనస్థలిపురంలో ఐదుగురు, ఎల్‌బీనగర్‌లో ఇద్దరు ఎక్కారు. చివరాఖరుకు ఆరాంఘర్ వద్ద రాత్రి 11.05 గంటలకు ముగ్గురు ప్రయాణికులతో కలిపి మొత్తం 42 మంది ప్రయాణికులు వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు.
అద్దాలు పగులగొట్టి బయటకు దూకా..
హైదరాబాద్: బస్సును అగ్నికీలలు చుట్టుముట్టిన సమయంలో గాఢ నిద్రలో ఉన్నాను. ప్రయాణికుల హాహాకారాలకు వెంటనే అప్రమత్తమై అద్దాలను పగులగొట్టి కిందకు దూకాను. నాతో పాటు మరికొందరు కిందకు దూకారు. నా ఎడమ కాలుకి స్వల్ప గాయమైంది. పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. కళ్లెదుటే బస్సు అగ్నికి ఆహుతై తోటి ప్రయాణికులు మృతిచెందిన ఘటన తనను తీవ్రవేదనకు గురిచేసింది. నాతో పాటు మరికొందరిని అధికారులు కారులో నగరానికి పంపించారు. దైవకృప వల్లే తాను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఇంటికి క్షేమంగా చేరుకోగానే తల్లిదండ్రులు, సోదరి, కుటుంబ సభ్యులు ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
-జయంత్ కుష్వా (27), విద్యానగర్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News