Hyderabad: క్యాచ్‌పిట్‌లో పడిన చిన్నారి..
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:51 AM
ఓ చిన్నారి వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లి అప్రమత్తతతో క్షేమంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలా కా చిల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మాన్ కుమార్తె జైనబ్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో యూకేజీ చదువుతోంది.
- తల్లి అప్రమత్తతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
- పాఠశాలకు వెళ్తుండగా ఘటన
- వరద నీటి ప్రవాహం లేకపోవడంతో సురక్షితం
- వ్యర్థాలు తొలగించి క్యాచ్‌పిట్ మూత పెట్టని సిబ్బంది
- హైడ్రా పనులు చేసిందంటున్న జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు
- సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు
- నేడు ఆయా విభాగాల సమావేశం
హైదరాబాద్ సిటీ: ఓ చిన్నారి వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లి అప్రమత్తతతో క్షేమంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలా కా చిల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మాన్ కుమార్తె జైనబ్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గురువారం ఉదయం తల్లితో కలిసి పాఠశాలకు బయలుదేరింది. గుడ్ లక్ కిరాణ దుకాణం సమీపంలోకి వచ్చే సరికి వరద నీటి కాలువపై క్యాచ్‌పిట్ మూత తెరిచి ఉండడం గమనించక ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లి జైనబ్‌ను బయటకు తీసింది. స్థానికులు జైనబ్‌కు సపర్యలు చేసి ఆమెలో ధైర్యాన్ని నింపి తల్లితో పాటు పాఠశాలకు పంపించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కాలువలో వరద నీటి ప్రవాహం లేకపోవడంతో చిన్నారి సురక్షితంగా బయటపడింది. లేని పక్షంలో వరద ఉధృతికి కొట్టుకుపోయేదని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల ఉరుకులు, పరుగులు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అప్రమత్తం చేయడంతో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హైడ్రా విభాగాల అధికారులు సల్మాన్ ఇంటికి క్యూ కట్టారు. చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? గాయాలయ్యాయా..? అని ఆరా తీశారు. దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఓ ప్రకటనలో బుధవారం అక్కడ హైడ్రా మాన్సూన్ టీమ్ ఆధ్వర్యంలో పని చేశారని తెలిపారు.

హైడ్రానే కారణం: జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు
ఈ ఘటనపై తప్పు తమది కాదంటూ ప్రభుత్వ విభాగాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్.. వరద నీటి కాలువలో వ్యర్థాల తొలగింపు హైడ్రా చేపట్టింది.. బుధవారం పనులు చేసిన సిబ్బంది క్యాచ్‌పిట్ మూయకుండా వదిలేశారని పేర్కొన్నారు. వాటర్‌బోర్డు కూడా అది మ్యాన్‌హోల్ కాదు.. క్యాచ్‌పిట్ అని, పూడికతీత చేపట్టాల్సింది హైడ్రా అని పేర్కొంది. జీహెచ్‌ంసీ, వాటర్‌బోర్డు, హైడ్రాలు పురపాలక శాఖ పరిధిలోని విభాగాలు.
ఘటన జరిగిన నేపథ్యంలో తమకు సంబంధం లేదన్నట్టు ప్రకటనలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఘటనను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. సమగ్ర సమాచారం తెల్సుకొని.. పొరపాటు జరిగితే సంబంధిత ఏజెన్సీ, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా విభాగాలు, ఘటనా స్థలి వద్ద ఉన్న సిబ్బందితో నేడు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కూడా అంగీకరించారని, మీటింగ్‌లో ఎవరు బాధ్యులు..? అన్నది తేలుతుందని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News