Health: మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడని తెలిసింది.. చిన్నారుల గుండెకు భరోసా!
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:09 PM
ఒకవైపు ఆనంద నిలయం, మరోవైపు దేవా లయాలు, విద్యాలయాలు... వీటికి సమీపం లోనే ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది హార్ట్‌కేర్ సెంటర్. ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఆసుపత్రిలోకి వెళ్లినట్టు కాకుండా ఆహ్లాదకరమైన ఒక ఆధ్యాత్మిక మందిరంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.
‘‘లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఉచితంగా చేస్తారంటే నమ్మలేక పోయాం. కానీ ఇక్కడికి వచ్చాక మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడని తెలిసింది’’... ఒక తల్లి భావోద్వేగం.
- - -
‘‘కొన్నేళ్లుగా మా ఇంట్లో ప్రతీ రోజు ఆందోళన. ఇక్కడికి రాగానే మా బిడ్డ ప్రాణాలకు భరోసా కలిగింది’’... ఒక ఆటో డ్రైవర్ కృతజ్ఞత.
- - -
‘‘పేదోళ్లం కాబట్టి మా బిడ్డకు వైద్యం దొరకదు అనుకున్నాం కానీ ఇక్కడ ప్రేమ గా చూసుకున్నారు. నా బిడ్డ మళ్లీ నవ్వు తున్నాడు. అంతకన్నా మాకేం కావాలి’’... ఒక వ్యవసాయ కూలీ కన్నీటి స్వరం.
- - -
మనదేశంలో ఏటా 3 లక్షల మంది చిన్నా రులు గుండె సంబంధిత సమస్యలతో జన్మించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషాదమే మిటంటే... వీరిలో సుమారు 75 వేల మంది పసి ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి బిడ్డలను కాపాడటానికే తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా, కొండపాకలో ‘శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్’ను ఏర్పాటు చేశారు.
అంతా ఉచితంగా...
ఒకవైపు ఆనంద నిలయం, మరోవైపు దేవా లయాలు, విద్యాలయాలు... వీటికి సమీపం లోనే ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది హార్ట్‌కేర్ సెంటర్. ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఆసుపత్రిలోకి వెళ్లినట్టు కాకుండా ఆహ్లాదకరమైన ఒక ఆధ్యాత్మిక మందిరంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులను తలపించే ఆధునిక సౌకర్యాలున్న ఈ సెంటర్‌లో బిల్లింగ్ కౌంటర్ అనేది ఉండదు. పేటీఎం స్కానర్లు కనిపించవు. ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పటి నుంచి... వైద్యం పూర్తయి, ఆసుపత్రి గేట్ దాటే వరకు పేషెంట్‌కు రూపాయి ఖర్చు కూడా ఉండదు. అంతా ఉచితమే. ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో గుండె సంబంధిత జబ్బులతో జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్యసేవలను ఉచితంగా అందిస్తారు.
‘‘100 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలోకి ఆధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు, పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ పరికరాలు ఉన్నాయి. 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఉచితంగా ఆపరేషన్లు చేసి మందులు ఇస్తారు. పేషెంట్‌తో పాటు ఇద్దరికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి ఆసుపత్రులను తెలంగాణ సహా నయా రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్), పల్వాల్ (హర్యానా), నవీ ముంబై (మహారాష్ట్ర)లలో నిర్వహిస్తున్నాం. ఆధార్ కార్డు ఉంటే చాలు... ఎవరైనా ఇక్కడ ఉచితంగా చికిత్స పొందవచ్చు. 15 దేశాల వారు చికిత్స పొందారు’’ అన్నారు చైల్డ్ హార్ట్ కేర్ ప్రతినిధి వరలక్ష్మి. గత 13 ఏళ్లలో ఇతర రాష్ట్రాల్లోని 3 కేంద్రాలలో 39 వేలకు పైగా చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేశారు. కొండపాకలో నవంబర్ 2024లో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 250 మందికి వైద్యం అందించారు.

పల్లెల్లో వైద్య శిబిరాలు కూడా...
చైల్డ్ హార్ట్ కేర్ వాలంటీర్ల బృందం మారు మూల పల్లెల్లో, గిరిజన ఆవాసాల్లోని అంగన్ వాడీ కేంద్రాల వద్ద హెల్త్ క్యాంపులు నిర్వహి స్తారు. వైద్యపరీక్షలు చేసి గుండె సమస్యలున్న చిన్నారులను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పిల్లలకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నారు.
అత్యాధునిక క్యాత్‌లాబ్
క్యాత్ ల్యాబ్ (Cath Lab) అనేది గుండె సంబంధిత సమస్యలను కోత లేకుండా గుర్తిం చడానికి, పరీక్షించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే ఆధునిక వైద్య విధానం. గుండెనాళాల్లో బ్లాకులు ఉంటే... రక్తనాళాల్లోకి రంగు ద్రవాన్ని పంపించి, స్ర్కీన్‌పై బ్లాకులు ఎలా ఉన్నాయో గుర్తించి... చిన్న బెలూన్‌ను రక్తనాళంలో ప్రవేశపెట్టి, బ్లాకు ఉన్న చోటకు పంపించి, అవసరమైతే స్టెంట్ కూడా వేస్తారు. పెద్ద శస్త్రచికిత్స అవసరముండదు. లక్షల్లో ఖర్చయ్యే ఈ క్యాత్ ల్యాబ్ చికిత్సను ఇక్కడ బిడ్డలకు ఉచితంగానే చేస్తారు.
‘‘మా బాబుకి పుట్టుకతో గుండె సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌లో చూపిస్తే రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. కూలీ చేసుకునే మేము ఆందోళనతో ఉన్నపుడు ఈ ఆసుపత్రి గురించి తెలిసింది. మా బిడ్డకు ఉచితంగా, విజయవంతంగా ఆపరేషన్‌చేశారు. ఈ ఉపకారం ఎప్పటికీ మరిచిపోలేం’ అన్నారు మహబూబ్‌నగర్‌కు చెందిన అంజమ్మ.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి 83 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ వెళ్లే హైవేలో కొండపాక దగ్గర ఉంది శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్. ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు (ఫోన్: 80101 19000, వాట్సాప్: 70751 37733). ‘అందరినీ ప్రేమించండి. అందరికీ సేవ చేయండి’ అనే ఆశయంతో ప్రారంభమైన శ్రీ సత్యసాయి సంజీవని ఒక ఆస్పత్రి మాత్రమే కాదు... ఒక బిడ్డ గుండెకు భరోసా.
- శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం
Read Latest Telangana News and National News