Share News

High Court: హైటెక్‌ కోర్టు!

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:42 AM

హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా, అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా, భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది.

High Court: హైటెక్‌ కోర్టు!

  • అధునాతన సౌకర్యాలతో నభూతోః అనిపించేలా

  • నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం

  • రూ.2,583 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో 10 బ్లాకులు

  • 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం

  • ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం

  • 8.4 లక్షల చ.అడుగుల్లో.. 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం

  • అడ్వొకేట్‌ జనరల్‌ బ్లాక్‌ కూడా 6 అంతస్తుల్లోనే..

  • 35,530 చ.అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా

  • 63మంది జడ్జిల కోసం 2.67లక్షల చ.అడుగుల్లో క్వార్టర్లు

  • జడ్జిల స్టాఫ్‌ కోసం 96,500 చ.అడుగుల్లో నివాసాల ఏర్పాటు

  • ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్‌ సదుపాయం

  • పచ్చదనానికి ప్రాధాన్యం.. కోర్టు చుట్టూ మొక్కలు

  • మొత్తంగా 3 డిజైన్లు.. ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ప్రాథమిక నమూనా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా, అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా, భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది. దీని ప్రకారం నిర్మాణం సాకారమైతే గనక నభూతోః అనిపించేలా హైకోర్టు భవన సముదాయం కళ్లకు కట్టనుంది! రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిర్మాణం కోసం రూ.2,583 కోట్లు అవసరపడతాయని అంచనా వేసి, పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. నిరుడు భూమిపూజ, శంకుస్థాపనలు పూర్తయ్యాయి. భవన సముదాయం నిర్మాణం కోసం ప్రాథమికంగా రూపొందించిన నమూనా ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. ఈ నమూనా ప్రకారం.. వందెకరాల్లో 36,52,840 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బ్లాకులతో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రధాన ద్వారాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల తరహాలో నిర్మించనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, హైకోర్టు భవన నిర్మాణ కమిటీలు చర్చిస్తున్నాయి. ప్రధాన కోర్టు భవనాన్ని 8.4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రధాన న్యాయమూర్తి హాలు ఏ అంతస్తులో ఉండనుందనేది ఇంకా ఖరారు కాలేదు. అడ్వొకేట్‌ జనరల్‌ ఉండే బ్లాక్‌నూ ఆరు అంతస్తులతో 2.32 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బ్లాక్‌కు అదనంగా మరొక బ్లాక్‌ను1.1లక్షల చ.అడుగుల్లో, న్యాయవాదుల చాంబర్‌ను 1.58 లక్షల చ.అడుగుల్లో ఐదు అంతస్తులతో నిర్మించనున్నారు. ఇక 2.57లక్షల చ.అడుగుల్లో ఆరు అంతస్తులతో అడ్మిన్‌ బ్లాక్‌-1ను, అదనపు అడ్మిన్‌ బ్లాక్‌ను 1.42లక్షల చ.అడుగుల్లో ఐదు అంతస్తులతో, అడ్మిన్‌ బ్లాక్‌-2ను 1.4 లక్షల చ.అడుగుల్లో ఐదు అంతస్తులతో, 60 వేల చ.అడుగుల్లో రికార్డు రూమ్‌ బ్లాక్‌ను, 42,500 చ.అడుగుల్లో ఆడిటోరియం బ్లాక్‌ను, జీ ప్లస్‌ వన్‌గా నిర్మించనున్నారు. కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యాల కోసం 1.63లక్షల చదరపు అడుగుల్లో గ్రౌండ్‌ ప్లస్‌ రెండు అంతస్తులను నిర్మించనున్నారు.


63 మంది జడ్జిల కోసం నివాసాలు

హైకోర్టు నూతన భవన సముదాయంలో భాగంగా నిర్మించనున్న జడ్జిల నివాసాలూ విశాలంగానే ఉండనున్నాయి. ప్రధాన న్యాయమూర్తి బంగళాను 35,530 చదరపు అడుగుల్లో, ఆయన సెక్రటెరియట్‌ను 7,260 చ.అడుగుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో జడ్జిల సంఖ్య పెరగనుండటంతో ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి మినహా మిగతా 63 మంది జడ్జిల క్వార్టర్స్‌ కోసం 2.67లక్షల చ.అడుగుల స్థలాన్ని కేటాయించారు. 96,500 చ.అడుగులతో జడ్జిల స్టాఫ్‌ క్వార్టర్స్‌ను, 14వేల చ.అడుగులతో క్లబ్‌ హౌస్‌ను, 9వేల చ.అడుగులతో కార్ల సర్వీస్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు. మొత్తం నివాసాల నిర్మాణానికి 4,37,070 చ.అడుగుల స్థలాన్ని కేటాయించారు. జడ్జిలు, న్యాయవాదులు, కోర్టుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్‌ కోసం 9,33,640చ.అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఒకేసారి 2800 వాహనాలు పార్క్‌ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇతరత్రా అభివృద్ధి పనులకు 70,820 చ.అడుగుల, ఇతర సౌకర్యాల కోసం 12వేల అడుగుల స్థలాన్ని కేటాయించారు. కాగా భవన సముదాయం కోసం ‘ఆంధ్రజ్యోతి’కి లభించిన ప్రాథమిక నమూనాతో పాటు మరో రెండు నమూనాలను కూడా పరిశీలిస్తున్నారు. మూడు నమూనాల్లో ఒకదాన్ని ఖరారు చేశాక పనుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఒప్పందాలు పూర్తయిన రెండేళ్లలోనే హైకోర్టు భవన సముదాయాన్ని పూర్తి చేయనున్నారు.


ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన గుడి

నూతన భవన సముదాయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నివాసాలు, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్‌, ఆ సిబ్బంది నివాసాలతో పాటు పార్కు, క్లబ్‌ హౌస్‌లను నిర్మించనున్నారు. కోర్టు ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన ఒక గుడిని నిర్మించనున్నారు. మొత్తంగా.. ప్రధాన ద్వారం, గుడి, సెక్యురిటీ బ్లాక్‌, ఎలక్ట్రిసిటీ సబ్‌ స్టేషన్‌, బయో వ్యర్థాల కోసం ఏర్పాట్లు, రెండు పబ్లిక్‌ కారు పార్కింగ్‌ స్థలాలు, ఎత్తైన మెట్లతో ప్రధాన కోర్టులోకి వెళ్లే మార్గం, పబ్లిక్‌ సర్వీస్‌, సౌకర్యాలకు ఒక బ్లాక్‌, పబ్లిక్‌ ప్లాజా, ప్రధాన కోర్టు భవనం, న్యాయవాదుల చాంబర్‌, అడ్వకేట్‌ జనరల్‌ బ్లాక్‌, రెండు అడ్మిన్‌ బ్లాక్‌లు, ఆడిటోరియం, జడ్జిల ప్లాజా, క్లబ్‌ హౌస్‌, జడ్జిల నివాస సముదాయాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌.. ఇలా మొత్తం 27 విభాగాలుగా భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.

హైకోర్టు నూతన భవన వివరాలు..

నిర్మాణ అంచనా: రూ.2,583 కోట్లు

నిర్మాణ స్థలం: 100 ఎకరాలు

నిర్మాణ విస్తీర్ణం: 36,52,840 చ.అడుగులు

హైకోర్టు నూతన భవనంలో బ్లాకులు: 10

ప్రధాన కోర్టు బ్లాక్‌: 6 అంతస్తులు

ప్రధాన న్యాయమూర్తి నివాసం: 01

ఇతర న్యాయమూర్తుల కోసం నివాసాలుః 63

పార్కింగ్‌ స్థలం: 9.33లక్షల చ.అడుగులు


ఈ వార్తలు కూడా చదవండి:

Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

Hyderabad: బాబోయ్.. హైదరాబాద్​లో షాకింగ్ ఘటన

Updated Date - Feb 17 , 2025 | 03:42 AM