Telangana High Court: సీఎస్ కార్యాలయం అంధకారంలో ఉన్నట్లుంది!
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:56 AM
నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రమాణపత్రం దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాన కార్యదర్శి నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు
ప్రమాణపత్రం దాఖలు చేయలేదు.. ప్రత్యక్షంగా హాజరు కాలేదు!
‘నిషేధిత జాబితా భూముల’పై ఇంత నిర్లక్ష్యమా?
సీఎ్‌సపై హైకోర్టు ఆగ్రహం.. చివరి అవకాశంగా వారం గడువు
తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రమాణపత్రం దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిషేధిత జాబితా భూముల వివరాల సేకరణను 9 వారాల్లో పూర్తిచేయాలని.. ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టినట్లు 10 రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని, అలా చేయకపోతే సీఎస్ ప్రత్యక్షంగా హాజరుకావాలని జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఆగస్టు 25న ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఈ పిటిషన్లు మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశించిన విధంగా రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని నిషేధిత జాబితా (సెక్షన్ 22ఏ) భూముల వివాదాలను పరిష్కరించడానికి సీసీఎల్‌ఏ చైర్మన్‌గా, రిటైర్డ్ జిల్లా జడ్జి, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సభ్యులుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు, దేవాదాయ శాఖ కమిషనర్, వక్ఫ్ బోర్డు ఇతర సంస్థలు తమ పరిధిలోని నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరించి, క్రోడీకరించి తగిన నమూనాలో పంపాలని ఈ నెల 1న ప్రభుత్వం మెమో జారీ చేసిందని చెప్పారు. వాదనలు విన్న జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం.. నిషేధిత భూముల వివరాల సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు సీఎస్ ప్రమాణపత్రం దాఖలు చేయలేదని, ప్రత్యక్షంగా హాజరు కావాలన్న ఆదేశాలను సైతం పాటించలేదని గుర్తుచేసింది. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కనీసం అప్లికేషన్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రవర్తనను సీఎస్ కార్యాలయం నుంచి ఊహించలేదంది. సీఎస్ కార్యాలయం అంధకారంలో ఉన్నట్లు తెలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి సీఎస్ కార్యాలయానికి చివరి అవకాశంగా మరో వారం గడువు ఇస్తున్నామని.. దాఖలు చేయకపోతే సీఎస్ ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరుకావాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
తీర్పులు అమలు చేయకపోవడం వల్లే..
నిషేధిత జాబితాపై గతంలో హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం ‘వింజమూరి రాజగోపాలాచారి’ కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అలాగే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ‘ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ కేసులో సైతం ఒక తీర్పును వెలువరించింది. నిషేధిత జాబితా భూముల వివాదాలు పరిష్కరించడానికి ఒక కమిటీ లేదా ఫోరం ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడమే హైకోర్టు ఆగ్రహానికి కారణమైంది. గత తీర్పులు అమలు చేయకపోవడం వల్లే నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించాలంటూ హైకోర్టుకు భారీ ఎత్తున పిటిషన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత తీర్పులు అమలు చేయాలని, నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News