Share News

High Court: ‘తుక్కుగూడ డబుల్‌ ఇళ్ల’ లబ్ధిదారుల జాబితా కొట్టివేత

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:03 AM

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని మంకాళ్‌లో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించి 2023 సెప్టెంబరు 2న ప్రకటించిన లబ్ధిదారుల జాబితాను, ఇళ్ల కేటాయింపును హైకోర్టు కొట్టివేసింది.

High Court: ‘తుక్కుగూడ డబుల్‌ ఇళ్ల’ లబ్ధిదారుల జాబితా కొట్టివేత

  • అధికారులు మార్గదర్శకాల్ని పాటించలేదు

  • అర్హులైన పిటిషనర్లు, ఇతర స్థానికులకు 3 నెలల్లో ఇళ్లు ఇవ్వాలి: హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని మంకాళ్‌లో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించి 2023 సెప్టెంబరు 2న ప్రకటించిన లబ్ధిదారుల జాబితాను, ఇళ్ల కేటాయింపును హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మలక్‌పేట్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడ ఇళ్లు కేటాయించడం చెల్లదని.. స్థానికులమైన తమకు అర్హత ఉన్నప్పటికీ ఇళ్లు కేటాయించడం లేదని పేర్కొంటూ ఐనాల లక్ష్మమ్మ మరో 13 మంది మంకాళ్‌ గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన గ్రామానికి చెందిన వారన్నారు. భూసేకరణ ద్వారా 9.20ఎకరాలు స్థానిక పట్టాదారుల నుంచి సేకరించి, 2700 డబుల్‌ ఇళ్లు నిర్మించారని తెలిపారు. తాము ఇళ్ల కోసం ఎదురుచూస్తుండగా 2023 సెప్టెంబరు 2న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ లబ్ధిదారుల జాబితా విడుదల చేశారని.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చార్మినార్‌, చంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించారని వివరించారు. ఆ జాబితాను కొట్టేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం అర్హత ఉన్న పిటిషనర్లు, స్థానికులకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తర ఫు న్యాయవాదులు వాది స్తూ.. అవి జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదల కోసం నిర్మించామని, అయినప్పటికీ స్థానిక కోటా కింద కూడా కొన్ని ఇళ్లు కేటాయించామని తెలిపారు.


లబ్ధిదారుల జాబితా నిబంధనల ప్రకారమే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ జీవో 10 ప్రకా రం చూసినా రూరల్‌ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50ు, మైనారిటీలకు 7ు, మిగిలినవి ఇతరులకు కేటాయించాలని, అలాగే అర్బన్‌ జిల్లాలకు ఎస్సీలకు 17ు, ఎస్టీలకు 6, మైనారిటీలకు 12ు, మిగతావి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ‘ఒక నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యే 50ః50 శాతం నిష్పత్తితో లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జీవోలో ఉంది. సదరు లబ్ధిదారుల జాబితాలను స్థానిక తహసీల్దార్‌ లేదా జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీ చేసి గ్రామసభ ఎదుట ఉంచాలి. సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల ప్రకారం పరిశీలించి జిల్లా కలెక్టర్‌ లేదా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపాలి. 2015లో జీవో 12, 2020లో జీవో 3 ద్వారా డబుల్‌ ఇళ్లకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు విడుదల చేశారు. వాటి ప్రకారం కూడా స్థానికులకు వెయ్యి యూనిట్లు లేదా 10ు కేటాయించాలని ఉంది. ప్రస్తుత కేసులో 14 మంది పిటిషనర్లు మహేశ్వరం నియోజకవర్గం/మండల పరిధికి చెందిన వారు. ఆ నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించారు. జీవో 3 ప్రకారం చూ సినా 10ు లేదా వెయ్యి యూనిట్లు కేటాయించాలి. 2023 సెప్టెంబరు 2న లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే ప్రభుత్వ అధికారులు మార్గదర్శకాలను పాటించలేదని స్పష్టమవుతోంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు లభించలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. లబ్ధిదారుల జాబితాను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. జీవోల ప్రకారం పిటిషనర్లు, ఇతర స్థానికుల అర్హతను పరిశీలించి 3 నెలల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని పేర్కొంది.


రంగారెడ్డి జిల్లాలో కొత్త జాబితాలు ప్రకటించాలి: వీరేందర్‌గౌడ్‌

తుక్కుగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను బీఆర్‌ఎస్‌ సర్కారు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికి కేటాయించడం అక్రమమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ అన్నారు. అందుకే హైకోర్టు ఆ జాబితాను కొట్టివేసిందన్నారు. వాస్తవానికి తుక్కుగూడలో కట్టిన ఇళ్లలో ఏకంగా 89ు అంటే 2,400 ఇళ్లను ముస్లింలు, అందునా స్థానికేతరులకు కేటాయించారని చెప్పారు. తుక్కుగూడ ప్రాంతంలో ముస్లింల జనాభా 50ు కంటే ఎక్కువగా మారేలా వ్యవహరించారని, ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జీవోకు విరుద్ధంగా 89ు ఇళ్లు ఒకే వర్గానికి ఎలా ఇచ్చారని కోర్టు ప్రశ్నించిందని వీరేందర్‌గౌడ్‌ చెప్పారు. ఈ తీర్పును బీజేపీ స్వాగతిస్తోందన్నారు. మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు జాబితాలన్నీ రద్దు చేసి, కొత్త జాబితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 05:03 AM