Share News

Heavy Rains: వాన అలజడి

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:45 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి

Heavy Rains: వాన అలజడి

ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు

  • ఉప్పొంగిన వాగులు.. పలు గ్రామాలు జల దిగ్బంధం

  • దివిటిపల్లి దగ్గర హైవేపై వరద

  • గల్లంతైన ఆశా వర్కర్‌ మృతి

  • హిమాయత్‌సాగర్‌ 11 గేట్లు ఎత్తి నీటి విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. పలుచోట్ల వాగులు ఉప్పొంగాయి. చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఐటీ పార్కుకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఓ కంపెనీ బస్సు ఒరిగిపోయి 18 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. వాగులు ఉప్పొంగి వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపూర్‌, పెద్దమందడి, వనపర్తి, గోపాల్‌పేట మండలాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చెర్లతిర్మలాపురం, నాగనూల్‌ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పాలేరు, వైరా ప్రాజెక్టులు నిండాయి. మున్నేరులోనూ వరద పెరుగుతోంది. జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మూసీ నది ఉప్పొంగుతోంది.

22.jpg


ఉప్పొంగుతున్న ఈసీ, మూసీ..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో పలు పెంకుటిళ్లు కూలిపోయాయి. వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా సగటున 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బషీరాబాద్‌ మండలంలో కాగ్నా నది ఉప్పొంగడంతో జీవన్గిలోని మహాదేవలింగేశ్వర దేవాలయం నీట మునిగింది. వందల ఎకరాల్లో పొలాల్లో నీరు నిలిచింది. ఈసీ, మూసీ నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గండిపేట, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. హిమాయత్‌సాగర్‌ తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఆ రహదారిని మూసివేశారు. మూసీ వరదతో పరీవాహక ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌ నగరం పొడవునా మూసీ నదిని ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జియాగూడ, పురానాపూల్‌ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అధికారులు పలు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు.


కృష్ణాలో తగ్గుతున్న ప్రవాహం..

ఎగువ పరీవాహక ప్రాంతంలో వానలు నిలిచిపోవడంతో కృష్ణా నదిలో వరద తగ్గుతోంది. జూరాలలో గేట్లన్నీ మూసివేశారు. తుంగభద్ర నుంచి 23వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి మూడు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 1.99 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 26 గేట్లు ఎత్తి 2.37 లక్షల క్యూసెక్కులను.. పులిచింతలకు 3.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, 2.51 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. మరోవైపు గోదావరి నది దిగువ పరీవాహకంలో వరద పోటెత్తుతోంది. గురువారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3.41 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం), సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. ఎగువ గోదావరిలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 2,941 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 13,910 క్యూసెక్కుల, ఎల్లంపల్లికి 12,998 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తోంది.


గల్లంతైన ఆశా వర్కర్‌ మృతి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొట్లగూడెంలో బండలవాగులో గల్లంతైన ఆశా వర్కర్‌ ఇర్ప లక్ష్మి(60) మృతి చెందారు. గురువారం ఉదయం వాగులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బోయిలకుంట్లకు చెందిన యువకుడు భాను (24) గురువారం.. ముగ్గురు స్నేహితులతో కలసి వరద నీటిలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు.

బురదలో 3 కిలోమీటర్లు నడిచి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అంగారుగూడెం గ్రామానికి రోడ్డు లేదు.. పైగా వర్షంతో మట్టి దారి అంతా బురదమయంగా మారింది. గురువారం మండల వైద్యాధికారి రవితేజ, సిబ్బంది కష్టమ్మీద ఆ బురదలోనూ 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.


వర్షాలతో 562 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో దాదాపు రూ.592 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 377 ప్రాంతాల్లో 562 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత, తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 121 చోట్ల రోడ్ల పైనుంచి నీరు ప్రవహిస్తోంది. 80 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. 45చోట్ల సమస్యను పరిష్కరించారు. జిల్లాలవారీగా చూస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78 కి.మీ, జోగులాంబ గద్వాలలో 68, సంగారెడ్డిలో 51, నిజామాబాద్‌లో 45, కామారెడ్డిలో 25 కి.మీ. మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే కొమురంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, సత్తుపల్లి ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. మహబూబ్‌నగర్‌లో తెగిన రోడ్డును పునరుద్ధరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 04:45 AM