Hyderabad Rain: కుండపోత వర్షం.. హైదరాబాద్ ఆగమాగం
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:25 AM
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ విభాగం తెలిపింది.
చెరువులను తలపించిన రహదారులు
లోతట్టు ప్రాంతాలు జలమయం
కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు
పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్
రేపూ ఎల్లుండి పలు జిల్లాలకు అలర్ట్
శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ.. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకూ వర్షం దంచి కొట్టింది. దీంతో వరద నీటితో రహదారులన్నీ చెరువులను తలపించాయి. పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో కురిసిన వర్షంతో వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇళ్లకు చేరడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థల ఉద్యోగులు రాత్రి ఏడు గంటల వరకూ ఆఫీసుల్లోనే ఉండిపోయారు. ఖాజాగూడలోని ల్యాంకో హిల్స్ సమీపాన తాటిచెట్టుపై పిడుగు పడటంతో చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్ మండలం మహదేవ్‌పూర్ జీహెచ్‌ఎంసీ డివిజన్ ఆఫీసు పరిధిలో అత్యధికంగా 15.1.సెం.మీ, బంజారాహిల్స్‌లో 12.4 సెం.మీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

రంగంలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి, ఐటీ కారిడార్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఆ సంస్థ బృందాలు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ నియంత్రించారు. పలుచోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వరద వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై నెటిజన్లు తీవ్ర నిరసన తెలిపారు. ఇక జిల్లాల్లో మొక్కలు వాడిపోయే పరిస్థితిలో కురిసిన వర్షంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లిలో 102.0 మి.మీ, రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో 79.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కల్వర్టు నిర్మించక 30 ఎకరాల్లో వరిపొలాలు నీటమునిగాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా కట్టంగూరులో 60.8 మి.మీ వర్షపాతం రికార్డయింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ సమీపాన మూసీలో కొట్టుకుపోతున్న నలుగురు పశువుల కాపర్లను పోలీసులు, రెస్క్యూ టీం రక్షించారు.
పలు జిల్లాలకు యెల్లో అలర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం 13 జిల్లాలు, బుధవారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు చెప్పారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయమై సోమవారం సచివాలయంలో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం రేవంత్.. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద ఉధృతి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. వచ్చే 2,3 రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎటువంటి సాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్లతో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు విపత్తు సహాయ బృందాలు అందుబాటులో ఉండటంతోపాటు తక్షణ సాయమందించాలని ఆయన చెప్పారు.
శ్రీశైలానికి 1.01 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎగువన తగ్గిన వర్షాలతో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు వరద తగ్గడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను మూసేశారు. శ్రీశైలానికి 1.01 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతోంది. దిగువన నాగార్జున సాగర్ నీటి మట్టం 586.50 (302.912 టీఎంసీల) అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 66.407 క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు కాల్వలతోపాటు ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వ, జల విద్యుత్ కేంద్రంతో కలిపి మొత్తం దిగువకు 44,132 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుత్ ఉత్పత్తికి 15 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణ పేట రిజర్వాయర్‌కు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2500 క్యూసెక్కులు, జూరాలకు 49 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. సుంకేశులకు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 12,726 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News