CM Revanth Reddy: ఎన్నికల్లో చేసే ప్రసంగాలపై కేసులా?
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:28 AM
ఎన్నికల సమయంలో చేసే రాజకీయ ప్రసంగాలపై కూడా కేసులు పెడతారా? ఇది సరికాదు. బీజేపీ ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసుకు విచారణార్హత లేదు..
రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఆపాదించరాదు.. రేవంత్‌పై బీజేపీ నేత ఫిర్యాదుకు విచారణార్హత లేదు
ప్రజాప్రతినిధుల కోర్టులో కేసును కొట్టివేయాలి
హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల సమయంలో చేసే రాజకీయ ప్రసంగాలపై కూడా కేసులు పెడతారా? ఇది సరికాదు. బీజేపీ ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసుకు విచారణార్హత లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీల నాయకులు రాజకీయ ప్రసంగాలు చేస్తారని, అది సర్వసాధారణమని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని వ్యాఖ్యానించడంతోపాటు అమిత్ షా మాట్లాడినట్లుగా ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదించారు. ‘‘బీజేపీ ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు విచారణార్హత లేదు.
ఈ ఫిర్యాదు దాఖలు చేయడానికి ఆయనకు ఎవరు అనుమతి ఇచ్చారు? బీజేపీ నుంచి అధికారికంగా సమాచారం వచ్చిందా? కాసం దాఖలు చేసిన ఫిర్యాదు తప్పుల తడక. దురుద్దేశంతో కూడుకున్నది. రేవంత్‌రెడ్డి ప్రసంగం వల్ల బీజేపీకి పరువునష్టం కలిగిందని నిరూపించడానికి తగిన ముడి సరుకు లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారే తప్ప ముఖ్యమంత్రిగా కాదు. ఎన్నికల సమయంలో చేసిన రాజకీయ ప్రసంగాన్ని ఆధారంగా చేసుకొని ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఆపాదించడం ఉండదు. ఆర్టికల్ 19 ప్రకారం.. మాట్లాడే స్వేచ్ఛలో భాగంగానే రాజకీయాలపై మాట్లాడతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని బీజేపీ నేతలూ విమర్శలు గుప్పిస్తుంటారు. అది కూడా పరువునష్టం కిందికే వస్తుందా? అలా అయితే బీజేపీపై చాలా కేసులు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రాజకీయ నేతలు చేసే ప్రసంగాలను పరువునష్టంగా భావించడం ఉండదు’ అని రేవంత్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 2కు వాయిదా పడింది.
కేంద్ర మాజీ మంత్రి సర్వేపై కేసు కొట్టివేత
కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణపై 2018 ఎన్నికల సందర్భంగా నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ రూ.50 లక్షలు సర్వే సత్యనారాయణకు చెందినవని ఓ నిందితుడు చెప్పడంతో ఆయనపై కేసు పెట్టారు. కేవలం స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ జరపడానికి అవకాశం లేదని పేర్కొంటూ సర్వేపై కేసును హైకోర్టు కొట్టేసింది. మరోవైపు బీసీ బంధు ఇవ్వాలంటూ అనుమతి లేకుండా ధర్నా చేసిన వ్యవహారంలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుపై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. 144 సెక్షన్ అమల్లో ఉండగా స్టేషన్‌లోకి వెళ్లి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన మరో కేసులో ఎంపీ రఘునందన్ దర్యాప్తు ఎదుర్కోవాలని హైకోర్టు పేర్కొంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News