High Court: గోషామహల్‌లో ఓజీహెచ్ నిర్మాణం సర్కారు నిర్ణయం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:13 AM
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.
హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఓజీహెచ్‌ను గోషామహల్ స్టేడియానికి తరలించడం చెల్లదని, అది స్థానిక ప్రజల హక్కులు, పర్యావరణం, జోనల్ రెగ్యులేషన్స్‌కు విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏజీ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అన్ని అనుమతులు పొంది, నిర్మాణాలు సైతం ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది.
118 ఏపీపీ పోస్టుల భర్తీకి 2 వారాల్లో నోటిఫికేషన్
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ జూన్‌లో అనుమతి ఇచ్చింది. స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 262 ఏపీపీ పోస్టులు ఖాళీగా ఉండగా 118కి భర్తీకి అనుమతి లభించింది. ఆర్థిక శాఖ ఓకే చెప్పినా నోటిఫికేషన్ జారీ చేయడం లేదంటూ రామాంతపూర్‌కు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాసులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News