Harish Rao: 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:01 AM
కాంగ్రెస్ సర్కారు 20 నెలల పాలనలో వివిధ కారణాలతో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..
స్వయంగా పర్యవేక్షిస్తానన్న సీఎం మాటలు నీటి మూటలేనా?
కాంగ్రెస్ పాలనలో దిక్కుతోచని స్థితికి విద్యా వ్యవస్థ: హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారు 20 నెలల పాలనలో వివిధ కారణాలతో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతోందని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. గురుకులాల్లో సంఘటనలు జరిగినప్పుడు.. తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయన్నారు. మాటలు తప్పా చేతల్లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఎందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని.. ఇటీవల పలు గురుకులాల్లో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను ఆయన ప్రస్తావించారు. వీటిని చూస్తూ తల్లిదండ్రులు భయపడుతున్నారని, బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యా వ్యవస్థ.. నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని విమర్శించారు. ‘విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? గురుకులాల్లో జరుగుతున్న మరణ మృదంగానికి బాధ్యులెవరు రేవంత్‌రెడ్డీ..’ అని నిలదీశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందన్నారు.
ఎందరు మరణించినా సీఎంకు సోయి రావట్లేదు: కేటీఆర్
గురుకుల హాస్టల్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందుకు కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే కారణమని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోయి రావడం లేదని మండిపడ్డారు. గురుకులాల్లో మోగుతున్న మరణ మృదంగాన్ని ఆపకపోతే తల్లిదండ్రుల శాపనార్థాలు తగిలి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు. ‘కళ్ల ముందే వరి నారు ఎండిపోతుంటే తట్టుకోలేక.. ఆడబిడ్డలు బిందెలతో నీళ్లు పోసే పరిస్థితి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యమా? ఎంత దుస్థితి తెచ్చినవ్ రేవంత్ రెడ్డి.. రైతాంగం అగచాట్లు కనబడటం లేదా..?’ అంటూ మరో పోస్టులో ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి