Harish Rao: బనకచర్లకు రేవంత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుంది!
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:32 AM
గోదావరి బేసిన్‌లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి ఏపీకి ఎన్ని నీళ్లైనా తీసుకెళ్లాలని చెప్పడానికి నువ్వేమైనా రాజువా? నదీ జలాలు మీ అయ్య జాగీరా..
నదీ జలాలు మీ అయ్య జాగీరా?
రాష్ట్ర హక్కులు బాబుకు రాసిస్తే.. ప్రజలు ఊరుకోరు
బాబును అడుక్కునే బుద్ది పోవట్లేదు
అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎంను ఉరి తీసినా తప్పులేదు
బీఆర్‌ఎస్ నేత హరీశ్ విమర్శలు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి ఏపీకి ఎన్ని నీళ్లైనా తీసుకెళ్లాలని చెప్పడానికి నువ్వేమైనా రాజువా? నదీ జలాలు మీ అయ్య జాగీరా? మాకిన్ని నీళ్లు ఇచ్చి, మిగిలిన మొత్తం తరలించుకెళ్లమని చెప్పడానికి నువ్వెవరు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. గోదావరిలో 1950 టీఎంసీలు కావాలని కేసీఆర్ గతంలోనే అడిగారని, అలాంటిది నువ్వు 1000 టీఎంసీలు ఇస్తే చాలని, బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోవాలని చెబుతావా? అని నిలదీశారు. రేవంత్‌కు బేసిన్స్, బేసిక్స్ కూడా తెలియవని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బనకచర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉందన్నారు. రేవంత్ తాను నల్లమల పులిబిడ్డనని చెప్పుకొంటాడని.. ఆయన పులిబిడ్డ కాదని, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని హరీశ్ ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు నిరంజన్‌రెడ్డి, మాలోతు కవిత, సబితా ఇంద్రారెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, తదితరులతో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ఓ వైపు మన రాష్ట్రానికి కృష్ణాలో 763 టీఎంసీల కోసం కొట్లాడుతుండగా.. మరోవైపు నువ్వు 500 టీఎంసీలు చాలంటే ఎవరికి నష్టమని నిలదీశారు. ట్రైబ్యునల్ దాన్నే ఆమోదిస్తే, తెలంగాణకు అన్యాయం జరగదా? అని ప్రశ్నించారు. నీ స్వార్థం కోసం రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తానంటే ప్రజలు ఊరుకోరని, ఉద్యమిస్తారని హెచ్చరించారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ అప్పటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్నారని, అప్పుడు బనకచర్ల ముచ్చటే రాలేదని చెప్పారు. అలాంటిది బనకచర్లకు నీళ్లు తీసుకువెళ్లాలని కేసీఆర్ చెప్పారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 200 టీఎంసీల నీటిని ఏపీ కొట్టుకుపోతుంటే ఆపలేవా?అని ప్రశ్నించారు.
అలా చెప్పడానికి నువ్వెవరు?
2020 అక్టోబరు 2న కేంద్ర మంత్రికి అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాశారని.. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల గోదావరి నీళ్లలో 1950 టీఎంసీలు తెలంగాణకు కావాలని అందులో కోరారని హరీశ్ గుర్తుచేశారు. కృష్ణా బేసిన్లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని ట్రైబ్యునల్ ముందు గతంలో అఫిడవిట్ దాఖలు చేసినట్లు చెప్పారు. అలాంటిది గోదావరి బేసిన్‌లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీకి ఎన్ని నీళ్లైనా తీసుకెళ్లాలని చెప్పడానికి నువ్వెవరివి? అని రేవంత్‌ను నిలదీశారు. అఖిలపక్ష సమావేశాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేశారని, అసలు విషయాన్ని దాచిపెట్టారని చెప్పారు. రేవంత్ చదివిన పేజీలోనే గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ముందుకు వెళ్లకూడదని ఉందని.. ఒకవేళ అలా చేస్తే తెలంగాణ అంగీకరించదని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాలను దాచిపెట్టి, కేసీఆర్‌ను బద్నాం చేసేలా రేవంఅబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. జగన్‌తో తాము ఏం మాట్లాడామనే అజెండా ఉంటే బయటపెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: నిరంజన్‌రెడ్డి
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా పెంపు కోసం ప్రయత్నించక పోగా కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలిచ్చి మిగిలినవి తీసుకొమ్మనడం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతా రాహిత్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ పాలనలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. ప్రతి అంశంలో తెలంగాణను కించపరిచి, అవహేళన చేసి మాట్లాడడం ఆయనకు తగదని, ఇదొక మానసిక రుగ్మతలా కనబడుతోందని విమర్శించారు.
బేసిన్స్, బేసిక్స్ తెలియదు..!
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోమంటే సీఎంకు అర్థం కావడం లేదని హరీశ్ ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందని అడగడం ద్వారా ఆయన తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి బేసిక్స్.. బేసిన్స్.. రెండూ తెలియవని, బ్యాగుల మీద ఉన్న పరిజ్ఞానం బేసిన్‌లపై లేదని చెప్పారు. ఆయనలో విషం తప్ప విషయం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బనకచర్ల ఎక్కడ ఉందని సీఎం అడిగితే ఆయన సలహాదారుడు ఆదిత్యాదాస్ ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పారని.. బనకచర్ల ప్రస్తుత నంద్యాల జిల్లా పరిధిలో ఉందన్న విషయం కూడా వారిద్దరికీ తెలియకపోవడం దారుణమని పేర్కొన్నారు. మాట్లాడితే నల్లమల పులిబిడ్డనని చెప్పే ఆయన ఆ ప్రాంతం తెలంగాణలోదా? ఆంధ్రాలో ఉందా? అని అడిగారని, అలాగే దేవాదుల గోదావరి బేసిన్ కదా అంటూ అజ్ఞానంతో అడిగారని విమర్శించారు. సీఎం మాటలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదన్నారు. చంద్రబాబును అడుక్కునే బుద్ధి రేవంత్‌కు ఇంకా పోవడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్‌బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల వాటా విషయంలో అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎంను ఉరి తీసినా తప్పులేదన్నారు.
ఉత్తమ్ రాజీనామా చేయాలి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఏకమై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టడమే వాటి లక్ష్యమని హరీశ్ ఆరోపించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే రెండు రోజులకే వచ్చిన ఎన్‌డీఎ్‌సఏను.. ఎస్‌ఎల్‌బీసీ కూలి, పలువురు మృతిచెందినా మోదీ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. రూ.వేల కోట్లు వృథా కావడమేగాక ఎస్‌ఎల్బీసీ భవితవ్యం ప్రశ్నార్థకమైందన్నారు. దీనికి బాఽధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News