Harish Rao: నాగయ్య మరణం ప్రభుత్వ హత్యే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:59 AM
ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య మరణం ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్
ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న బాధతో నాగయ్య ఆత్మహత్య
హైదరాబాద్, పిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య మరణం ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో గత నెల 23న నిర్వహించిన గ్రామసభలో నాగయ్య పురుగు మందు తాగాడు. అప్పట్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య గురువారం మరణించాడు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ సభ పేరిట ప్రభుత్వం నాగయ్య కుటుంబంలో నిప్పులు పోసిందని మండిపడ్డారు. నాగయ్య భార్య, ముగ్గురు కుమార్తెలకు దిక్కు ఎవరిని ప్రశ్నించారు. నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని, రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలిట అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తమని హరీశ్ వ్యాఖ్యానించారు. కాగా, మధ్యాహ్న భోజనం బాలేదని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చెన్నారం పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కడం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పని తీరుకు నిదర్శనమని హరీశ్ ఎద్దేవా చేశారు. ఇక, రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్, సర్‌చార్జీలు పదేళ్లలో భారీగా పెరగడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పన్నుల్లో వాటాలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. 2013-14లో రూ.1.08 లక్షల కోట్లుగా ఉన్న ఈ పనులు 2026నాటికి రూ.5.56లక్షల కోట్లకు చేరనున్నాయని తెలిపారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వడంపై కేంద్రం పునఃపరిశీలన చెయ్యాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News