Harish Rao: ప్రజలను రోడ్డున పడేసిన కాంగ్రెస్
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:13 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి
ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కేసులు తీసేయాలి: హరీశ్‌రావు
కవాడిగూడ/నార్సింగ్/హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలపై ఎలాంటి కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌తో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ఎన్నికల మ్యానిపెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. ఆ హామీని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.
తనిఖీల పేరుతో ఆర్యోగశాఖ అధికారుల వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆర్‌ఎంపీ, పీఎంపీల సమస్యలపై గళం విప్పుతామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీల తరఫున ప్రతినిధి వస్తే మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదని ఆర్‌ఎంపీ, పీఎంపీలతోపాటు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని.. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య అధ్యక్షుడు పంగ మల్లేశ్ తదితరులు మాట్లాడుతూ జీవో 429 ప్రకారం ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, హెల్త్ గైడ్స్‌గా తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
కూల్చివేతలపై హరీశ్ మండిపాటు
గండిపేట మండలం కాళీమందిర్ ప్రాంతంలో మునిసిపల్ అధికారులు కూల్చివేసిన ఇళ్లు, దుకాణాలను హరీశ్‌రావు పరిశీలించి.. బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ పేదల ఇళ్లు, దుకాణాలను అకస్మాత్తుగా కూలగొడితే వారు ఎలా బతుకుతారని మునిసిపల్ అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికైనా హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చవద్దని, అన్నారు. అనంతరం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కమిషనర్‌తో మాట్లాడి కూల్చివేతలను నిలిపివేయించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News