Harish Rao: నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి..!
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:19 AM
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు డిల్లీకి.. అన్నట్లుగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగించే కార్యక్రమాల కోసమే సీఎం ఢిల్లీ వెళ్తారని..
రేవంత్ పాలనలో జరుగుతున్నది ఇదే: హరీశ్
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు డిల్లీకి.. అన్నట్లుగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగించే కార్యక్రమాల కోసమే సీఎం ఢిల్లీ వెళ్తారని.. ఇప్పుడు కూడా అందుకే వెళ్లారని, అంతకు మించి ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల జీతాల నుంచి తల్లిదండ్రుల సంక్షేమం కోసం 10 శాతం ఇవ్వాలని సీఎం మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. అలాగైతే అడ్డదారిలో అధికారంలోకి వచ్చి, నయవంచన చేసిన ఆయనకు ఏం కోత పెట్టాలని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోయకపోవడంతో అవి మూలన పడ్డాయన్నారు. ఊళ్లలో బల్బులు పెట్టేవాళ్లు కూడా లేరని, పాలన పడకేసిందని చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా.. కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైందన్నారు.
కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు కూడా వస్తాయని, మోటార్లు ఆన్ చేయాలని అడిగితే పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిజం చెప్పే దైర్యం లేక ఉత్తమ్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు. మెదక్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని, ఇక్కడ నాలుగు లైన్ల రోడ్లు, డివైడర్లు, అద్భుతంగా నిర్మించారని చెప్పారు. ఈ ప్రాంతంలో చిట్టచివరి ఆయకట్టు వరకు నీళ్లందేలా చేశారన్నారు. శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులు అయ్యింది అబద్ధమా? మోటార్లు ఆన్ చేయనిది అబద్ధమా? 65 శాతం నీటిని వినియోగించకుండా ఏపీకి వదిలింది అబద్ధమా? అని హరీశ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం అబద్ధం కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో గోదావరిలో లక్ష క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేద్దామని, రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాను ఎగరేద్దామని హరీశ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి