Share News

Harish Rao: కాళేశ్వరం, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:43 AM

కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం. ఏ రోజైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు.

Harish Rao: కాళేశ్వరం, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

  • కెమెరా తిప్పొద్దు, మైక్‌ కట్‌ చేయొద్దు

  • శాసనసభను వాయిదా వేసి పోవొద్దు

  • బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సవాల్‌

  • ఘోష్‌ కమిషన్‌కు 100 పేజీలతో నివేదిక

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం. ఏ రోజైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు. మైక్‌ కట్‌ చేయొద్దు. అసెంబ్లీని వాయిదా వేసుకొని పోవొద్దు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందో తెలియనివారు సీఎం అయితే.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలైనా బేసిక్స్‌ తెలియని వారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను శుక్రవారం కలిసిన ఆయన.. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి, ఆరుసార్లు మంత్రివర్గ తీర్మానం, మూడుసార్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని పేర్కొంటూ 100 పేజీల నివేదికను హరీశ్‌రావు సమర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘రేవంత్‌ రెడ్డి అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు. ఉమ్మడి ఏపీలో 54లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నాడు. బీఆర్‌ఎస్‌ హయాంలో 17లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశాం. మొత్తం 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.’’ అని చెప్పారు. 2004-2014 దాకా పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మొత్తం ఆరు లక్షల ఎకరాలకే సాగునీరు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగిందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. 20 నెలల్లో ఒక్క చెరువు, ఒక్క కాలువ అయినా తవ్వారా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టు అయినా కట్టినట్లు చూపించండని నిలదీశారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్‌ పాపం కాంగ్రె్‌సదేనని, పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు 20 నెలల్లోనే జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 34 శాతం తెలంగాణకు చాలని సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ సంతకాలు చేశారని మండిపడ్డారు. 60 టీఎంసీలను గురుదక్షిణగా చంద్రబాబుకు ఇచ్చారని ఆరోపించారు.


కవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చినది పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కాదని అది 50 ఏళ్ల కాంగ్రెస్‌ ద్రోహ చరిత్రకు కవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అని హరీశ్‌ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో 299 టీఎంసీలు తెలంగాణకు చాలని, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించాలని శాశ్వత ఒప్పందం చేసుకున్నారంటూ అబద్ధం చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తాత్కాలిక వినియోగానికి, నీటి పంపకానికి తేడా తెలియకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి చేతకాని నాయకుల వల్లే 299 టీఎంసీల వినియోగానికే అవకాశం దొరికిందని ఆక్షేపించారు. రాష్ట్రాల వారీగా నీటిని పంచాలని తెలంగాణ ఏర్పడిన 42 రోజులకే కేంద్రాన్ని కోరుతూ కేసీఆర్‌ లేఖ రాశారని హరీశ్‌ గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో శాశ్వత ఒప్పందం చేసుకొని ఉంటే.. సెక్షన్‌-3 కింద నీటి పంపకాలు ఎందుకు అడుగుతామని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గడపతొక్కి, నిర్విరామ పోరాటం చేసి, కేంద్రం మెడలు వంచి, సెక్షన్‌-3 సాఽధించామని చెప్పారు. ఆ సెక్షన్‌-3 ప్రకారం తెలంగాణ న్యాయవాదులు 763 టీఎంసీల కోసం వాదనలు వినిపిస్తుంటే.. కృష్ణాలో 500 టీఎంసీలు చాలని రేవంత్‌రెడ్డి, 535 టీఎంసీలు చాలని ఉత్తమ్‌ చెబుతున్నారని మండిపడ్డారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలని ఏ విధంగా చంద్రబాబుకు ఆఫర్‌ ఇస్తారని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో 2918 టీఎంసీలు కావాలని కేసీఆర్‌ కోరారని గుర్తు చేశారు.


నీటి లభ్యత లేదని చెప్పింది సీడబ్ల్యూసీయే

తుమ్మిడిహెట్టి వద్ద 102 టీఎంసీలు, మేడిగడ్డలో 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందని హరీశ్‌ తెలిపారు. కాళేశ్వరం విచారణలో పలు వివరాలు ప్రభుత్వం కమిషన్‌కు ఇచ్చిందని ప్రచారం జరుగుతోందని, అసలు ఇచ్చిందా లేదా అన్న అనుమానంతోనే 100 పేజీలతో తానొక నివేదిక ఇచ్చానని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లబ్యారేజీలకు సంబంధించి ఆరుసార్లు క్యాబినెట్‌ సమావేశమయిందని, మూడుసార్లు శాసనసభ ఆమోదం కూడా ఉందని గుర్తు చేశారు. కమిషన్‌ విచారణపూర్తయ్యాకా కమిషన్‌కు అందించిన వివరాలన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రముఖ ఇంజనీరు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ ఆద్యుడని, ఇరిగేషన్‌ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని హరీశ్‌రావు ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. సర్‌ఆర్థర్‌ కాటన్‌, కేఎల్‌రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి దిగ్గజాలసరసన నిలిచిన గొప్ప ఇంజినీర్‌ మనతెలంగాణలో పుట్టడం గర్వకారణన్నారు. నవాజ్‌జంగ్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 04:43 AM