Share News

Harish Rao: బనకచర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్‌ అబద్ధాలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:42 AM

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల ప్రస్తావనే లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: బనకచర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్‌ అబద్ధాలు

  • ఆ ప్రాజెక్టుపైనే కమిటీ అన్న ఏపీ మంత్రి

  • కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం.. తెలంగాణకు మరణ శాసనమే

  • బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల ప్రస్తావనే లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదని బుకాయించారని, ఒక సీఎం ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఏజెండా కాపీలోని మొదటి అంశమే గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు గురించి అని పేర్కొంటూ సంబంధిత కాపీని మీడియా ఎదుట విడుదల చేశారు. బనకచర్ల ప్రాజెక్టు, ఇతర అంశాల పరిష్కారానికే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని గుర్తు చేశారు. బనకచర్లపై సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తానని లీకులిచ్చిన సీఎం.. మాటమార్చి అందరికంటే ముందు సమావేశంలో ఆసీనులయ్యారని ఎద్దేవా చేశారు.


ఎవరి ఒత్తిడితో ఈ సమావేశానికి వెళ్లారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు బనకచర్లపై కేంద్రం భేటీయే తప్పని.. అందులో తెలంగాణ సీఎం పాల్గొనడం మరో తప్పన్నారు. నాలుగు కేంద్ర సంస్థలు తిరస్కరించిన ప్రతిపాదనపై సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తామని రేవంత్‌ చెప్పడం సబబు కాదన్నారు. ఇది తెలంగాణ పాలిట మరణ శాసనమని అభివర్ణించారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్‌ పాలన కాదని, బీజేపీ-టీడీపీ రిమోట్‌ పాలన అని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌ పాలన సాగిస్తున్నారని, తెలంగాణ నీళ్లను అక్రమంగా తరలించుకుపోతున్నా స్పందించడం లేదని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డికి నోటి తీట తప్ప, నీటి వాటా సాధించాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీలో కూటమిపాలన, తెలంగాణలో విషకూటమి పాలనసాగుతోందని ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 03:42 AM