GST Reform: జీఎస్టీ తగ్గినా.. ఆస్పత్రుల్లో రోగులకు ఊరట దక్కేనా?
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:54 AM
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ప్రజలకు ఆస్పత్రుల ఖర్చులు, మందుల భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. ఔషధాలపై జీఎస్టీని తగ్గించడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి ఆర్థిక భారం కొంత తగ్గనుంది.
ఔషధాలపై జీఎస్టీ తగ్గడంతో దీర్ఘకాలిక రోగులకు తగ్గనున్న ఆర్థిక భారం
అయితే, మెడికల్ యంత్రాలపై తగ్గిన జీఎస్టీని ప్రైవేటు ఆస్పత్రులు అమలు చేయడంపై అనుమానాలు
వేరే ఖర్చులు పెరిగిన నేపథ్యంలో చికిత్సల చార్జీలు తగ్గబోవంటున్న ప్రైవేటు ఆస్పత్రులు
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ప్రజలకు ఆస్పత్రుల ఖర్చులు, మందుల భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. ఔషధాలపై జీఎస్టీని తగ్గించడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి ఆర్థిక భారం కొంత తగ్గనుంది. అదే సమయంలో ఆస్పత్రుల్లో అత్యవసర సమయాల్లో వాడే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్‌లపై ప్రస్తుతం ఉన్న 12ు జీఎస్టీని కేంద్రం 5 శాతానికి తగ్గించింది. అయితే, ఆస్పత్రుల్లో నిత్యం వినియోగించే ఈ వస్తువులపై జీఎస్టీ భారం తగ్గినప్పటికీ... ఆ ఊరట రోగులకు లభిస్తుందా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక రోజు ఐసీయూలో ఉంటే సగటున రూ.30-రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌పై 12 శాతం ఉన్న జీఎస్టీ భారాన్ని 5 శాతానికి తగ్గించారు. ఆ మేరకు ఐసీయూలో ఉన్న రోగిపై బిల్లు భారం కూడా తగ్గాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం ఇతరత్రా వ్యయాల దృష్ట్యా రోగులకు చార్జీలు పెద్దగా తగ్గబోవని చెప్తున్నారు. ఎవరైనా ఆస్పత్రికి వెళ్తే టెస్టులు చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. డయాగ్నస్టిక్ కిట్లపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఆ మేరకు రోగులపై టెస్టులకయ్యే చార్జీలు తగ్గుతాయా అంటే కచ్చితంగా చెప్పలేమని వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి ఎండీ ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. మెజార్టీ ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం రోగులపై చార్జీల భారంలో ఎటువంటి మార్పు ఉండబోదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. మరోవైపు, ప్రస్తుతం ఆరోగ్యంతో పాటు ఫిట్‌నె్‌సపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరుగుతోంది. దీంతో చిన్న పట్టణాల్లో కూడా హెల్త్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు వెలుస్తున్నాయి. వీటికి వెళ్లే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం హెల్త్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, యోగా సెంటర్లలో జీఎస్టీని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించింది.
కేంద్రం ఇచ్చిన రిలీఫ్ రోగులకు అందాల్సిందే
ఆస్పత్రుల్లో వాడే యంత్రాలు, టెస్టింగ్ కిట్లు, మెడికల్ ఆక్సిజన్‌పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12ు నుంచి 5 శాతానికి తగ్గించడం గొప్ప నిర్ణయంగా చెప్పాలి. దీంతో కొంతమేరకు రోగులపై భారం తగ్గుతుంది. ఈ ఊరట రోగులకు అందాల్సిందే. అయితే, ప్రైవేటు ఆస్పత్రులు వెంటనే దీన్ని అమలు చేయకపోవచ్చు. కానీ, రాబోయే రోజుల్లో ఆస్పత్రుల మధ్య పోటీ వల్ల అవే చార్జీలను తగ్గించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. - డాక్టర్ జీ.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News