Share News

BC Reservations: సభకు బీసీ బిల్లులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 03:43 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగానే ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

BC Reservations: సభకు బీసీ బిల్లులు

నేడు ఆమోదం పొందిన వెంటనే జీవో

  • పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలకు సవరణ

  • రెండు ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం

  • 50 శాతం పరిమితిని తొలగించడానికే సవరణలు

  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజార్‌

  • వరద నష్టంపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష

  • తెలంగాణ రాష్ట్ర గోశాలల సంక్షేమ బోర్డు ఏర్పాటు

  • 2022-23 ధాన్యం బాకీలున్న మిల్లర్లపై పీడీ చట్టం

  • 3రోజుల్లో చెల్లించకుంటే చర్యలే.. క్యాబినెట్‌ నిర్ణయాలు

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగానే ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శాసనసభ ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం, గవర్నర్‌కు పంపిన రెండు ఆర్డినెన్స్‌లు కూడా రాష్ట్రపతి వద్దకే వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడా ఆర్డినెన్స్‌ల స్థానంలో రెండు బిల్లులను తిరిగి ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సెప్టెంబరు 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండడం, పాలక వర్గాలు లేక స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న క్యాప్‌ను తొలగిస్తూ పంచాయతీరాజ్‌ చట్టం-2018, పురపాలక చట్టం-2019 సవరణల బిల్లులను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. దాంతోపాటు బీసీలకు 42 రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ప్రత్యేక జీఓను జారీ చేస్తారు. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాలులో శనివారం మధ్యాహ్నం గంటకు పైగా జరిగిన సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, వరద నష్టం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అనంతరం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సమావేశం వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు ఆర్డినెన్స్‌లను రూపొందించి గవర్నర్‌ ఆమోదం కోసం ఇదివరకే పంపించామని తెలిపారు. అవి ఆమోదం పొందక పోవడంతో వాటి స్థానంలో రెండు చట్టాల సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న పంచాయతీరాజ్‌ చట్టం-2018, పురపాలక చట్టం-2019లోని నిబంధనలను తొలగించడం ఈ సవరణ చట్టాల లక్ష్యమని తెలిపారు. దానికితోడు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల కల్పనకు ప్రత్యేక జీఓను జారీ చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు.


వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం

ఇటీవల అతి భారీ వర్షాలతో వివిధ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు. పలు జాతీయ రహదారులు, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు, రైల్వే లైన్లు, చెరువులు దెబ్బ తిన్నాయన్నారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలంటూ కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. నష్ట వివరాలపై సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మరమ్మతులు, ఇతర పనులకు అనుమతులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నష్టాల వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను క్యాబినెట్‌ ఆదేశించిందన్నారు.

గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర గోశాలల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. పేరుకు గోశాలలు వందల్లో ఉన్నప్పటికీ నిర్వహణకు సరైన విధివిధానాలు లేవన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను ఉపయోగించుకోవడం, గోశాలల నిర్వహణలో మహిళలకు 50 శాతం భాగస్వామ్యాన్ని కల్పించడం, గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో గోశాలల నిర్మాణంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


వాతావరణ కేంద్రాల నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద ఇచ్చే గ్రాంటు గురించి చర్చించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా వర్షాలు కురియగానే మానవ ప్రమేయం లేకుండా వర్షపాతాన్ని లెక్కించడం కోసం వాతావరణ కేంద్రాలు, ప్రాజెక్టుల్లోకి వచ్చే వరదను కూడా లెక్కించడం కోసం వాటర్‌ గేజ్‌ స్టేషన్లు ఈ పథకం కింద ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మిల్లర్ల నుంచి సొమ్ము రికవరీ

2022-23 సంవత్సరంలోని రబీ సీజన్‌కు సంబంధించి మిల్లింగ్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయని మంత్రి చెప్పారు. రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తాలూకు బియ్యంను ఇవ్వాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం టెండర్లు పిలిచి వాటి పురోగతిని పట్టించుకోలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సొమ్ము రికవరీకి విధాన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సొమ్మును మూడు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేశారు. టెండర్ల సందర్భంలో దొడ్డు రకం, సన్నరకాలకు వేసిన బిడ్ల రేట్ల ప్రకారం రికవరీ ఉంటుందని చెప్పారు. రికవరీ సొమ్మును చెల్లించని మిల్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మత్స్య సహకార సంఘాల ఎన్నికలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించాలని నిర్ణయించామని చెప్పారు. సభ్యుల్లో ఒకరిని నామినేట్‌ చేస్తామన్నారు.


బిల్లులకు అన్ని పార్టీలు సహకరించాలి: పొన్నం ప్రభాకర్‌

బీసీలకు 42ు రిజర్వేషన్లను అమలు చేయడంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. న్యాయ కోవిదులతో చర్చల అనంతరమే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయన్నారు. అసెంబ్లీలో పెడుతున్న బిల్లులపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. దీనికి పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 05:58 AM