Share News

Hostel Incident: బాలికల వాష్‌రూంలో సెల్‌ కెమెరా!

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:28 AM

వసతి గృహం వాష్‌రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్‌ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.

Hostel Incident: బాలికల వాష్‌రూంలో సెల్‌ కెమెరా!

  • పాలమూరు పాలిటెక్నిక్‌ కాలేజీలో ఘటన

  • ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా మౌనం

  • ఏబీవీపీ నేతలు, విద్యార్థుల ఆందోళన

  • నిందితుడి అరెస్టు..

  • ప్రిన్సిపాల్‌పైనా చర్యలకు డిమాండ్‌..

మహబూబ్‌నగర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): వసతి గృహం వాష్‌రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్‌ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రిన్సిపల్‌ మాత్రం ఆ ఫోన్‌ను తీసుకొని, తన దగ్గరే అట్టి పెట్టుకొని, ఏమీ జరగనట్టుగా ఉండిపోయాడు. ఫిర్యాదు చేసి రెండు గంటలైనా పోలీసులకు ప్రిన్సిపల్‌ సమాచారం ఇవ్వకపోవడం.. అప్పటికే ఘటనపై కలకలం రేగడంతో కళాశాల విద్యార్థులంతా ప్రిన్సిపల్‌ గది ఎదుట బైఠాయించారు. పాలమూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం ఈ దారుణం వెలుగుచూసింది. ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన సిద్ధార్థ్‌ అనే పాత విద్యార్థి బ్యాక్‌ లాగ్స్‌ రాయడానికి రెండ్రోజుల క్రితమే ఈ కళాశాలకు వచ్చాడు.


అతడే తన సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌చేసి హాస్టల్‌ వాష్‌రూమ్‌లో ఉంచాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలతో పాటు విద్యార్థులు డిమాండ్‌ చేశారు. దాదాపు రెండు గంటలపాటు చేపట్టిన ధర్నాతో కళాశాల దద్దరిల్లింది. పోలీసులు, కళాశాల నిర్వాహకులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తాము ఫిర్యాదు చేశాక, సెల్‌ఫోన్‌ను గమనించి 2గంటలైనా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపల్‌ కాలయాపన చేశారని, గదిలోకి ఎవ్వరినీ రానివ్వలేదని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆందోళన జరుగుతుండగానే ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ పోయిందని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయడంతో అతడే ఈ పనిచేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమైంది. వాష్‌రూమ్‌లో లభించిన ఫోన్‌ అతడిదేనని తేలడంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 04:28 AM