Share News

Hyderabad: ఒకేవైపు 40 అడుగులు

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:15 AM

రహదారుల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ రహదారికి ఒకేవైపు ఆస్తులు సేకరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.

Hyderabad: ఒకేవైపు 40 అడుగులు

  • కేబీఆర్‌ పార్కు చుట్టూ ఆస్తుల సేకరణ

  • రహదారి విస్తరణకు ఆస్తుల మార్కింగ్‌

  • మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా నిర్ణయం

  • జాతీయ పార్కు కావడమే కారణం

  • ఎన్‌జీటీ కేసులతో నిలిచిన ప్రాజెక్టులు

  • ఆ ఇబ్బంది లేకుండా బల్దియా నిర్ణయం

  • యజమానులను ఒప్పించేందుకు యత్నం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రహదారుల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ రహదారికి ఒకేవైపు ఆస్తులు సేకరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. జాతీయ ఉదాన్యవనం కావడంతో పార్కు వైపు స్థల సేకరణకు పర్యావరణ నిబంధనలు అవరోధంగా మారే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డుకు ఒకవైపు 40 అడుగుల మేర సేకరణ కోసం మార్కింగ్‌ చేశారు. దీంతో భవనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాంకేతికంగా, న్యాయపరంగా అవరోధంగా మారుతుందని అధికారులూ పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉన్నత స్థాయి ఆదేశాలతో వంతెనలు, అండర్‌పా్‌సల కోసం ప్రకటించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. ఆస్తుల సేకరణపై స్పష్టత వచ్చాకే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ సిటీ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్నోవేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌-సిటీ)లో భాగంగా కేబీఆర్‌ చుట్టూ ఆరు కూడళ్లలో రూ.1090 కోట్లతో వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.


బంజారాహిల్స్‌ విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ కూడలి వరకు రహదారి విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) పట్టణ ప్రణాళికా విభాగం సిద్ధం చేసింది. 303 ఆస్తుల సేకరణకు మార్క్‌ చేశారు. విరించి నుంచి మహారాజ అగ్రసేన్‌ కూడలి వరకు 60 అడుగులుగా ఉన్న రోడ్డును 100 అడుగులకు విస్తరించనున్నారు. రోడ్డుకు ఒక్కోవైపు 20 అడుగుల చొప్పున ఆస్తులు సేకరణకు మార్కింగ్‌ పూర్తయింది. అగ్రసేన్‌ కూడలి నుంచి జూబ్లీ చౌరస్తా వరకు 80 అడుగుల రోడ్డు ఉండగా.. 120 అడుగులకు విస్తరించాల్సి ఉంది. వాస్తవంగా రహదారి విస్తరణకు ఇరువైపులా ఆస్తులు సేకరిస్తారు. ఇక్కడ ఒకవైపు మాత్రమే మార్కింగ్‌ చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో రోడ్డుకు ఇరువైపులా విస్తరణకు నిర్ణయించగా.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో పిటిషన్లు దాఖలై ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టును ఇబ్బందులు లేకుండా చేపట్టేందుకు ఒకవైపు ఆస్తుల సేకరణకు నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి కేబీఆర్‌ ప్రవేశ ద్వారం, బసవరతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా, అగ్రసేన్‌ చౌరస్తా వరకు డీపీఆర్‌ సిద్ధం చేయాల్సి ఉంది. ఇక్కడా 120 అడుగుల మేర విస్తరణ చేయాలని పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 14 , 2025 | 03:15 AM