GHMC: అనుమతులపై ‘మహా’ సందిగ్ధం...
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:16 AM
జీహెచ్‌ఎంసీని ఔటర్ అవతలి వరకు విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్‌నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేవిధంగా బిల్డ్‌నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు.
- ఔటర్ అవతలి వరకు విస్తరణతో అనుమతులిచ్చేదెవరు?
- హెచ్‌ఎండీఏ ఈసీ నిర్ణయమే కీలకం
- ప్రస్తుతం శివారులో పరిమితంగానే జీహెచ్‌ఎంసీ అనుమతులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఔటర్ అవతలి వరకు విస్తరించగా ఆయా ప్రాంతాల్లో లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల అధికారంపై సందిగ్ధం వీడడం లేదు. ప్రస్తుతం హెచ్‌ఎండీయేనే అనుమతులు ఇస్తుండగా, జీహెచ్‌ఎంసీలో విలీనంతో అనుమతుల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి నెలకొన్నది. విస్తరిత ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చే అధికారం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ(GHMC)కి పరిమితంగానే ఉంది.
జీహెచ్‌ఎంసీతో పాటు శివారు ప్రాంతాలన్నీహైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోనివి కావడంతో అధికారాల బదలాయింపుపై ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. హెచ్‌ఎండీఏ పరిధి జీహెచ్‌ఎంసీతో పాటు మొత్తం 11 జిల్లాలతో 10,472 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్నది. 2013 నాటి మాస్టర్‌ప్లాన్-2030 ప్రకారంగా హెచ్‌ఎండీఏ ప్రస్తుతం మెరుగైన పట్టణ ప్రణాళిక చర్యలు చేపడుతోంది.
ఈ పరిధిలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జారీ చేసేవి. హెచ్‌ఎండీఏ 2008లో ఏర్పడిన సందర్భంలోనే జీహెచ్‌ఎంసీ కూడా ఏర్పడగా.. ఆ సమయంలోనే భవన నిర్మాణ, లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల అనుమతులు జారీ చేసే అధికారాలను హెచ్‌ఎండీఏ బదలాయించింది. ఇక శివారు ప్రాంతాల్లో మాత్రం హెచ్‌ఎండీఏ జారీ చేస్తోంది. శివారులోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ అనుమతులిస్తోంది. తాజాగా ఆ ప్రాంతాలన్నీ జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి.

హెచ్‌ఎండీఏ ఈసీ నిర్ణయమే కీలకం
జీహెచ్‌ఎంసీని ఔటర్ అవతలి వరకు విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్‌నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేవిధంగా బిల్డ్‌నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుతం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు.
లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అనుమతులు, బహుళ అంతస్తుల భవనాల అనుమతులను హెచ్‌ఎండీఏనే జారీ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో కొత్తగా ఎవరైనా బహుళ అంతస్తులు, లేఅవుట్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే హెచ్‌ఎండీఏకు చేరుతున్నాయి. వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు మాత్రం జీహెచ్‌ఎంసీకి వెళ్తున్నాయి. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఎన్ని బహుళ అంతస్తుల నిర్మాణాలకైనా, లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలకైనా అనుమతులు ఇస్తున్నారు. విస్తరిత ప్రాంతాల్లో కూడా అన్నీ రకాల అనుమతులిచ్చే అధికారాలను జీహెచ్‌ఎంసీకి బదలాయించాలంటే హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News