Share News

GHMC, Waterboard: నల్లాలకు ఇక మీటర్లు తప్పనిసరి..

ABN , Publish Date - Sep 03 , 2025 | 08:01 AM

గ్రేటర్‌ పరిధిలో మీటరు లేని నల్లా కనెక్షన్‌ దారులపై వాటర్‌బోర్డు కొరడా ఝళిపించనుంది. ఇకనుంచి నల్లా కనెక్షన్లకు మీటర్లు తప్పనిసరి చేయాలని బోర్డు నిర్ణయించింది. నగరంలో ఉచిత తాగునీటి పథకం కింద నెలకు అర్హత ఉన్న ప్రతీ కనెక్షన్‌కు 20వేల లీటర్లను పంపిణీ చేస్తుండడంతో తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది.

GHMC, Waterboard: నల్లాలకు ఇక మీటర్లు తప్పనిసరి..

- నెలకు 20వేల లీటర్లకు మించి నీటి వాడకం

- పడిపోతున్న వాటర్‌బోర్డు ఆదాయం

- మీటర్‌ లేని కనెక్షన్‌దారుల గుర్తింపు సంస్కరణలతో ఆదాయం పెంపుపై దృష్టి

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌(Greater) పరిధిలో మీటరు లేని నల్లా కనెక్షన్‌ దారులపై వాటర్‌బోర్డు కొరడా ఝళిపించనుంది. ఇకనుంచి నల్లా కనెక్షన్లకు మీటర్లు తప్పనిసరి చేయాలని బోర్డు నిర్ణయించింది. నగరంలో ఉచిత తాగునీటి పథకం కింద నెలకు అర్హత ఉన్న ప్రతీ కనెక్షన్‌కు 20వేల లీటర్లను పంపిణీ చేస్తుండడంతో తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది.


city3.jpg

గ్రేటర్‌ పరిధిలో 9.73లక్షల నల్లా కనెక్షన్‌దారులున్నారు. వాటర్‌బోర్డు అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకంలో 4.70లక్షల కనెక్షన్లుదారులు (44శాతం) మాత్రమే చేరారు. వీరు మీటరు ప్రకారంగా నెలకు 20వేల లీటర్ల నీటిని జీరో బిల్లుతో వినియోగించుకోవచ్చు. ఆ పైబడి వాడితే పెరిగిన లీటర్ల నీటికి బిల్లు చెల్లిస్తున్నారు. అయితే, మీటర్లు లేని వారు ఇష్టానుసారంగా నీటిని వినియోగిస్తున్నారు. నల్లా కనెక్షన్లకు పూర్తిస్థాయిలో నీటి మీటర్లు లేకపోవడంతో సరైన లెక్కలు తేలడం లేదు.


5లక్షల కనెక్షన్లకు మీటర్లు లేవు

గ్రేటర్‌లో 5లక్షలకు పైగా నల్లా కనెక్షన్లకు మీటర్లు లేవు. మురికివాడల్లో నివసించే పేద కుటుంబాలకు మీటర్లు లేకపోయినా ఉచిత తాగునీటి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. కానీ, ఇతర ప్రాంతాల్లో భవనాల్లో ఉండే కుటుంబాలు మీటర్లు లేకుండా నీటిని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. నల్లా పైపు సైజ్‌ అంచనా ప్రకారంగానే నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. వారు వాడుతున్న నీళ్లకు.. చెల్లించే బిల్లులకు ఎలాంటి పొంతన ఉండడం లేదు. బోర్డుకు రావాల్సిన ఆదా యం కూడా రావడంలేదు. ఆదాయం కంటే అధికంగా సరఫరా అవుతున్నట్లు ఇటీవల వాటర్‌బోర్డు అధికారులు గుర్తించారు. వివరాలన్నీ పక్క గా తేలాలంటే అందరికీ మీటర్లు తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.


వాటర్‌బోర్డు ఆదాయం పెంపు దిశగా చర్యలు

ఉచిత తాగునీటి పథకం ద్వారా బోర్డుకు నెలకు దాదాపు రూ.30కోట్ల వరకు ఆదాయం పడిపోయింది. అయితే ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతీ ఏడాది బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.300కోట్లు కేటాయిస్తుండగా.. నిధుల విడుదల మాత్రం రూ.200కోట్లు కూడా చేయడం లేదు. ఈ క్రమంలో స్వతాహాగానే వాటర్‌బోర్డు ఆదాయాన్ని పెంచుకోవడానికి పలు సంస్కరణలు చేపడుతోంది. నల్లాలకు మీటర్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి కొంత గడువిచ్చి, ఆ తర్వాత సాధారణ చార్జీలకు అదనంగా చార్జీలను విధించడానికి కసరత్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 08:01 AM