Telangana High Court: హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:47 AM
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్‌కుమార్, గౌస్ మొహియుద్దీన్‌ల నియామకం
కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైకోర్టు న్యాయవాదులుగా ఉన్న వీరిని అదనపు జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు.
కొత్తగా నలుగురు న్యాయమూర్తుల చేరికతో ఈ సంఖ్య 30కి చేరనుంది. గౌస్ మీరా మొహియుద్దీన్: హైదరాబాద్‌లోని బాలానగర్ హెచ్‌ఎంటీ టౌన్ షిప్‌కు చెందిన గౌస్ మీరా మొహియుద్దీన్.. 1969లో జన్మించారు. 1993లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేయడంతోపాటు తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాత బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఇప్పటివరకు కొనసాగుతున్నారు.
సుద్దాల చలపతిరావు: జనగామకు చెందిన సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జన్మించారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఆయన.. హైకోర్టు, రంగారెడ్డి, సిటీసివిల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు.
వాకిటి రామకృష్ణారెడ్డి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. 1997లో న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఈడీ తరఫు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
గాడి ప్రవీణ్‌కుమార్: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎ్‌సజీ)గా పనిచేస్తున్న గాడి ప్రవీణ్‌కుమార్.. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 1971లో జన్మించారు.
ఏపీ హైకోర్టుకు నలుగురు శాశ్వత జడ్జిలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న నలుగురికి శాశ్వత న్యాయమూర్తుల హోదా లభించింది. సుప్రీం కోలీజియం సోమవారం ఈ సిఫారసును ఆమోదించింది. ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా ఉన్న జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్‌ను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..