Share News

సలేశ్వర క్షేత్ర దర్శనం.. ఇక నవ మాసాలు !

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:33 AM

దట్టమైన నల్లమల అడవుల్లో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో తొమ్మిది నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది.

సలేశ్వర క్షేత్ర దర్శనం.. ఇక నవ మాసాలు !

  • లింగమయ్య దర్శనానికి అటవీశాఖ సన్నాహాలు

  • ససేమిరా అంటున్న ఆదివాసీ సంఘాల నేతలు

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): దట్టమైన నల్లమల అడవుల్లో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో తొమ్మిది నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సమయంలో భక్తుల నుంచి వచ్చే ఆదాయంలో 30 శాతం అక్కడున్న చెంచులకు ఇస్తామని అటవీ శాఖ చెబుతుండగా, చెంచు సంఘాలు ఆమోదించడం లేదు. చైత్ర పౌర్ణమి నాడు సలేశ్వరం ఉత్సవాలు ప్రారంభం కావాలనేది ఆదివాసుల అభిమతమని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వ్యతిరేకిస్తామని ఆదివాసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పారెస్టు 2,611 చదరపు కి.మీ. విస్తరించి ఉంది. ప్రతీ ఏటా చైత్ర పౌర్ణమి నాడు పరహాబాద్‌కు 19 కి.మీ. దూరాన ఉన్న సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఈ సమయంలో కొన్నిసార్లు తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందిన, గాయపడిన ఘటనలు అనేకం జరిగాయి. 1990 దశకం వరకు సలేశ్వరాన్ని దర్శించుకునేందుకు 11 రోజుల పాటు అటవీశాఖ అనుమతించేది.


ఆ తర్వాత 7 రోజులకు, 5 రోజులకు, చివరికి దాన్ని 3 రోజులకు కుదించారు. అసంఖ్యాకంగా భక్తులు వస్తుండటంతో వన్య ప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ అటవీశాఖ.. ఆంక్షలను విధించింది. టోల్‌ టాక్స్‌, పార్కింగ్‌ ఫీజుల పేరిట అధిక మొత్తాన్ని వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జిల్లా పారెస్టు అధికారులు కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ఏడాదిలో 3 రోజులే అనుమతిస్తుండడంతో భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరుగుతోందని, అందువల్ల అటవీ ప్రాంతంలో పులులు గర్భం దాల్చే జూలై, ఆగస్టు, సెస్టెంబరు నెలలు మినహాయించి మిగతా తొమ్మిది నెలలు సలేశ్వరం దర్శించుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలను సహించేది లేదని చెంచులోకం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల గురువయ్య హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణ పేరిట చెంచులను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం.. ఈ విషయంలో మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమం తప్పదు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 03:33 AM